గిరిజన విద్యార్థినీ విద్యార్థులు చదువు పైనే ప్రత్యేక దృష్టి సారించాలి
వర్గ విభేదాలు లేకుండా ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి
కెరీర్ పైనే దృష్టి సారించి భవిష్యత్తును కాపాడుకోవాలి
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్
గుండాల, (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ ఈ ఎం ఆర్ ఎస్, గురుకులం, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు వర్గ విభేదాలు మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువు పైన దృష్టి సారించి, కెరీర్ పై దృష్టి సారించి అనుకున్న లక్ష్యాలు సాధించాలనీ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. గుండాల మండలం లోని ఈఎంఆర్ఎస్ పాఠశాలను ఆయన సందర్శించారు. ఇటీవల జరిగిన ఆందోళన నేపథ్యంలో విద్యార్థులు , ఉపాధ్యాయులతో విడివిడిగా సమావేశమై పాఠశాలలో జరిగిన సంఘటనలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... విద్యార్థిని విద్యార్థులు మీ గ్రామాన్ని మీ తల్లిదండ్రులను వదిలిచదువుకోవడానికి వచ్చారని, గురువులనే తల్లిదండ్రులుగా భావించి బాగా చదివి వృద్ధిలోకి రావాలన్నారు.
వివిధ మండలాలు గ్రామాలు జిల్లాల నుండి ఎంతో శ్రమపడి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకోవడానికి వచ్చినప్పుడు అందరూ సమన్వయంతో ఉండి చదువుకోవాలని నీది, నాది అనే భావనలు ఎవరు మనసులో పెట్టుకోకుండా అందరూ కలిసి చదువు పైనే ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఉపాధ్యాయులు సైతం పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలని, పిల్లలు ఎటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ఉండేలా వారికి ప్రతిరోజు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు తెలియజేస్తూ ఉండాలని అన్నారు. దేవాలయం లాంటి విద్యాలయాలలో పోలీసులు ప్రవేశించకూడదని, వారు ప్రవేశించారు అంటే కొంత తేడా ఉన్నట్లేనని, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని ఏ విధమైన సంఘటనలు జరిగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని, విద్యార్థులందరూ సమన్వయంతో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






