13 July, 2026 | 7:35 PM

ఆరుద్ర నక్షత్రం..! అరుదైన అభిషేకాలు...!!

13-07-2026 06:56 PM

శివాలయంలో భక్తుల రద్దీ

సోమవారం,ఆరుద్ర నక్షత్రం ప్రత్యేకత తో తెల్లవారుజాము నుండే అభిషేకాలు

 వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు అన్నదానానికి రూ.1 లక్ష విరాళం

అమీన్ పూర్: సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం రావడంతో బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ విశిష్టమైన రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నో ఏళ్లకు ఒకసారి సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం రావడం అత్యంత పవిత్రమైన సందర్భంగా భావించిన భక్తులు మునుపెన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ.. తెల్లవారుజాము నుంచే స్వామివారికి మహా రుద్రాభిషేకం నిర్వహించామని తెలిపారు. అనంతరం భక్తులందరికీ నిరంతరంగా అభిషేకాలు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారని తెలిపారు.

సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం కలిసిరావడంతో పరమశివుడికి అభిషేకం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారని పేర్కొన్నారు. ఆలయంలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష సహకారం అందుతోందని, ఈ సందర్భంగా వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం కోసం రూ.1 లక్షల విరాళాన్ని అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. రెండో శ్రీశైలంగా పేరుగాంచిన ఈ దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.