13 July, 2026 | 7:32 PM

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

13-07-2026 06:04 PM

జిల్లా కలెక్టర్‌కు టీడబ్ల్యూజేఎఫ్ నాయకుల వినతి

జగిత్యాల,(విజయక్రాంతి): జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రకాశ్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జగిత్యాల జిల్లా ఇన్‌చార్జి గుడిగె రఘు నాయకత్వంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి కరుణాకర్ రావు, జిల్లా కార్యదర్శి తరాల అతిక్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేయాలని, ముఖ్యమంత్రి హామీ మేరకు ఇండ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నచిన్న కారణాలతో పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, ఉచిత ఆర్టీసీ పాసులు మంజూరు చేయడంతో పాటు రైల్వే పాసుల పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.