4 March, 2026 | 10:09 PM

నూతన వార్డు సభ్యులకు పంచాయితీ రాజ్ చట్టంపై శిక్షణ ప్రారంభం

04-03-2026 08:36 PM

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు గ్రామ పాలనపై సమగ్ర అవగాహన కల్పించేందుకు తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం, 2018 పై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తొలి విడతగా ఎంపిక చేసిన 10 గ్రామాల వార్డు సభ్యులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ఎం.పి.డి.ఓ సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వార్డు సభ్యులు పంచాయితీ రాజ్ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉంటేనే గ్రామాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయగలుగుతారు. రాబోయే ఐదేళ్ల పదవీకాలంలో ఎదురయ్యే సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించే దిశగా ముందుకు సాగాలి” అని సూచించారు. ప్రతి వార్డు సభ్యుడు ఈ శిక్షణకు క్రమం తప్పకుండా హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో శిక్షకులు (TOT)గా ఎం. అరవింద్ నారాయణ, సలీం, సుధాకర్, సతీష్ గార్లు పాల్గొని మార్గదర్శకత్వం అందిస్తున్నారు. అదేవిధంగా సూపరింటెండెంట్ విజయలక్ష్మీ, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ నాయుడు, టైపిస్ట్ మల్లేశ్, పంచాయితీ కార్యదర్శులు, ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ శిక్షణ ద్వారా గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు చట్టబద్ధ అవగాహనతో, బాధ్యతాయుతంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి గ్రామాభివృద్ధికి మరింతగా తోడ్పడతారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.