28 August, 2026 | 9:22 AM

పండుగ పూట విషాదం

28-08-2026 12:00 AM

ఖానాపూర్ ,ఆగస్టు 27 (విజయ క్రాంతి): రాఖీ పండుగ పూట ఆ ఇంట్లో విషాదం నింపింది. సోదరులకు రాఖీలు కట్టడానికి వెళ్తున్న ఆటో బోల్తాపడడంత మూడు నెలల బాబు మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దస్తురాబాద్ కు చెందిన ఓ కుటుంబం గురువారం మధ్యాహ్నం ఆటోలో ఖానాపూర్ నుంచి నిర్మల్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మణచాంద మండలం వడ్డేపల్లి గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సురేష్, విజయ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మూడు నెలల బాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగిలిన ఏడుగురికి చికిత్స అందిస్తున్నారు. పండుగ రోజు తమతో కలిసి ఉండాల్సిన బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.