16 April, 2026 | 4:01 AM

సంధి దిశగా!

16-04-2026 01:45 AM

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు! 

హోర్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన 

మరోసారి చర్చలకు అమెరికా షరతులు

వాషింగ్టన్, ఏప్రిల్ 15: త్వరలో హోర్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం పేర్కొన్నారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం త్వరలో ముగియవచ్చునని ప్రక టించారు. వచ్చే మంగళవారంతో అమెరికా-ఇరాన్ మధ్య ముగియనున్న రెండువారాల కాల్పులు విరమణను పొడిగించే దిశగా రెండు దేశాలు సంప్రదిం పులు జరుపుతున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ పేర్కొంది.

హోర్ముజ్ జలసంధి ఇకపై ఘర్షణలకు కేంద్ర బింధు వు కాకుండా, ఇరాన్ అణు కార్యక్రమానికి ఒక పరిష్కారం కనుగొనే దిశగా సాంకేతిక చర్చలు జరుగుతు న్నట్లు తెలిపింది. ఇలావుండగా హోర్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరవడంతో చైనాతో పాటు ప్రపంచ మంతా లాభపడుతుందని ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వకుండా ఉండేందుకు బీజింగ్ అంగీకరించిందని ఆయన చెప్పారు.

ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్, తాము కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఆయనను కలుస్తానన్నారు. అదే సమయంలో యుద్ధం చేయడంలో అమెరికాను మించిన దేశం మరొకటి లేదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుత పరిణామాలతో చైనా హ్యాపీగా ఉందన్నారు. నవంబర్‌లో.. అమెరికాలో ఎన్నికలు వచ్చే సమయానికి చమురు ధరలు భారీగా పడిపోతాయన్నారు. వచ్చే రెండురోజుల్లో అమెరికా మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు.

అయితే, ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈసారి కూడ పాకిస్థాన్‌లోనే శాంతి చర్చలు ఉండొచ్చునని, అయితే ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాలంటే రెండు కఠినమైన షరతులను పాటించాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. దౌత్యపరమైన వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయెల్ హయోమ్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికా పెట్టిన మొదటి షరతు.. హర్మూజ్ జలసంధిని ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా తెరవడం.

ఇరాన్ గనుక తమ నౌకలు, ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకుంటే, తాము కూడా ఇరాన్ నౌకలను కదలనివ్వబోమని అమెరికా స్పష్టం చేసింది. ప్రతిచర్య తప్పదనే సంకేతాలను బలంగా పంపింది. ఇక రెండో షరతుగా.. చర్చలకు వచ్చే ఇరాన్ ప్రతినిధి బృందానికి ఒప్పందాలను ఖరారు చేసే పూర్తి అధికారం ఉండాలని అమెరికా పట్టుబడుతోంది.

ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్జీసీ) సహా ప్రభుత్వంలోని అన్ని కీలక విభాగాల ఆమోదం పొందే అధికారం ఆ బృందానికి ఉండాలని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్‌లో కుదిరే ఏ ఒప్పందానికైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరి సమ్మతి ఉండాలని కోరుకుంటోంది.

‘నాటో’ తీరుపై ట్రంప్ ఆగ్రహం..

ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కూటమిపై ఇప్పటికే పలుమార్లు విరుచుకపడిన ట్రంప్ మరోసారి భగ్గుమన్నారు. ఇరాన్‌తో యుద్ధానికి, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో తమకు నాటో కూటమి నుంచి ఏమాత్రం సాయం అందలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ సమయంలో నాటో దేశాలు అమెరికాకు ఆశించిన స్థాయిలో సహకరించలేదని ఆయన పేర్కొన్నారు.

అమెరికాకు అవసరమైనప్పుడు ఎప్పుడూ ఈ కూటమి అండగా లేదని ట్రంప్ ఆరోపించారు. భవిష్యత్తులోనూ దాని నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించదని మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా నాటోపై ట్రంప్ విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా ఈ కూటమిని ఓ కాగితపు పులిగా కూడా అభివర్ణించారు. నాటో నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.