ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
టేకులపల్లిలో మండల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కోరం
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని వివిధ శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రత్యేకంగా సమీక్షించిన ఎమ్మెల్యే, పునాదుల నుంచి పైకప్పు వరకు పనుల స్థితి, నిధుల వినియోగం, లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పనులు ఆలస్యమవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుని, అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. అలాగే మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీదేవి, ఎస్‌ఐ తిరుపతి, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






