29 July, 2026 | 11:30 PM

విద్యార్థుల బరువు కొలతలు తీసిన కలెక్టర్

29-07-2026 02:38 PM

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): తాడూరు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల చదువు, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం, హాజరు, మౌలిక వసతులు, ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ విద్యార్థులను బరువు కొలతలు స్వయంగా పరిశీలించారు. 

పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించారు. ప్రతిరోజూ అల్పాహారం తీసుకుంటున్నారా అని అడిగి ఆరోగ్య అలవాట్లపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు ప్రాథమిక దశలోనే బలమైన విద్యా పునాది వేయాలని, ఆంగ్ల మాధ్యమ బోధనను సమర్థంగా అమలు చేయాలని సూచించారు.

మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, నిర్ణీత మెనూ అమలును పరిశీలించి, పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారుల బరువు, ఎత్తు కొలతలను పరిశీలించి, పోషకాహార లోపం ఉన్న పిల్లలను ప్రత్యేకంగా గుర్తించి పర్యవేక్షించాలని సూచించారు. పౌష్టికాహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి, పిల్లలకు తాజా, పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశించారు.

ఆటలు, పాటలు, బొమ్మల ద్వారా చిన్నారులకు బోధన అందించాలని, విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత అంశాల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.