23-02-2026 01:11:39 AM
శ్రీనగర్, ఫిబ్రవరి 22: జమ్మూకశ్మీర్లోని కిస్‌త్వేర్ జిల్లా చత్రూ అటవీ ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ముగ్గు రు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ సైఫుల్లా బలోచ్ కీలకమైన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. రూ.5 లక్షల రివార్డు కలిగిన బలోచ్, లోయ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు.
చత్రూ బెల్ట్‌లోని పాసెర్కుట్ ప్రాం తంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ), సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. గత 15 రోజులుగా మం చుతో నిండిన అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం భద్రతా దళాలు ఉగ్రవాదుల స్థావరాన్ని చుట్టుముట్టడంతో కాల్పులు మొదలయ్యా యి.
ఈ ఆపరేషన్‌లో భారత సైన్యానికి చెందిన కే9 దళ శునకం టైసన్ అసాధారణ సాహసాన్ని ప్రదర్శించింది. దళాలను ముం దుండి నడిపిస్తూ ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని టైసన్ గుర్తించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో టైసన్‌కు బుల్లెట్ గాయమైంది. ప్రాణాపాయాన్ని లెక్కచేయకుండా అది ఉగ్రవాదుల ఉనికిని ధ్రువీకరించడంతో, సైనికులు వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
ప్ర స్తుతం టైసన్ చికిత్స పొందుతూ కోలుకుంటోంది. కాల్పుల సమయంలో ఉగ్రవాదులు దాక్కున్న గుడిసె అగ్నిప్రమాదానికి గురైంది. అనంతరం దళాలు అక్కడి నుంచి ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను వెలికితీశాయి. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామ గ్రిని స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో ఇదే అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడు, ఒక ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయారు. తాజా విజయంతో ఈ ప్రాం తంలో ఉగ్రవాద కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది.