14 May, 2026 | 2:18 PM

వరుస బైక్‌ చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

14-05-2026 12:57 PM

మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

సదాశివపేట, మే 14(విజయక్రాంతి): సదాశివపేట పట్టణం, పరిసర ప్రాంతాల్లో వరుసగా మోటార్‌సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని సదాశివపేట పోలీసులు అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సదాశివపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ డి. వెంకటేష్ మీడియాకు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇష్రీతాబాద్ గ్రామానికి చెందిన బలరాం సంగమేశ్వర్ జల్సాలు, మద్యానికి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని భావించి బైక్ చోరీలకు పాల్పడ్డాడు. ఇదే నెలలో ఇష్రీతాబాద్ గ్రామంలో ఒక పల్సర్ బైక్, ఆత్మకూరు గ్రామంలో ఒక గ్లామర్ బైక్, సదాశివపేట పట్టణంలో ఒక స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైంది.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి మూడు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. దొంగను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు వెంకటేశం, అమానుల్లా, నహీద్ పాషా, మల్లేశంలను ఇన్‌స్పెక్టర్ డి. వెంకటేష్ అభినందించారు.