జిల్లాలో యూరియా కొరత లేదు..
జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య
ఖమ్మం, జులై 2 (విజయక్రాంతి): వానాకాలం 2026 సీజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు మొత్తం 35,267 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని, జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు.
గురువారం ఖమ్మం జిల్లాలోని పలు దుకాణాలను అకస్మీకంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ప్రైవేట్ డీలర్ల వద్ద 691.13 మెట్రిక్ టన్నులు (15,359 బస్తాలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 920.02 మెట్రిక్ టన్నులు (20,445 బస్తాలు), మార్క్ ఫెడ్ ఖమ్మం వద్ద 7,656.16 మెట్రిక్ టన్నులు (1,70,137 బస్తాలు), కంపెనీ గోదాముల్లో 991.51 మెట్రిక్ టన్నులు (22,034 బస్తాలు), కమీషనర్ రిజర్వ్ పూల్ (సీఆర్పీ)లో 6,898.05 మెట్రిక్ టన్నులు (1,53,290 బస్తాలు) నిల్వ ఉన్నాయని తెలిపారు.
2026 జూలై 2 నాటికి జిల్లాలో మొత్తం 17,156.88 మెట్రిక్ టన్నుల యూరియా (3,81,264 బస్తాలు) అందుబాటులో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు యూరియా యాప్ ద్వారా 56,926 మంది రైతులు 1,80,738 బస్తాలను బుక్ చేసుకొని, 1,60,316 బస్తాలను కొనుగోలు చేశారని తెలిపారు. యూరియా యాప్ ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను బుక్ చేసుకుని కొనుగోలు చేస్తున్నారని వివరించారు.
రైతు సోదరులు ఎలాంటి అపోహలకు గురి కాకుండా అవసరమైన మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని, జిల్లాలో రైతులకు అవసరమైన మేరకు యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ప్రతి మండల పరిధిలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోందని, రైతులు యూరియా లభ్యతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






