చినుకు జాడేది..?
- రైతన్న చూపు ఆకాశం వైపు
- ఊరిస్తున్న వరుణుడు
- రైతన్న గుండెల్లో ఆశలు
- జూన్‌లో వర్షాభావం
- జూలైపైనే ఖరీఫ్ ఆశలు
అలంపూర్, జూలై 2: ఈరోజైనా వాన పడుతుందేమో...అనే ఆశతో అలంపూర్ నియోజకవర్గ రైతన్న ప్రతి ఉదయం ఆకాశం వైపు చూస్తున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అప్పులు చేసి పత్తి, మిరప, మొక్కజొన్న, కంది, జొన్న తదితర పంటలు సాగు చేసిన రైతులకు వరుణుడు ఇంకా కరుణించకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. దాదాపు 15 రోజులుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో విత్తనాలు సరిగా మొలకెత్తని చోట్ల రెండోసారి విత్తాల్సిన పరిస్థితి నెలకొంది.
మొలకెత్తిన పంటలు కూడా తేమ లేక వాడిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలంపూర్, ఉండవల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి, రాజోలి, వడ్డేపల్లి, అయిజ మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొందరు రైతులు మిరప సాగును కాపాడుకునేందుకు పొలాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లోనైనా వర్షాలు కురవకపోతే ఖరీఫ్ పంటలకు తీవ్ర నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌నినోపై అవగాహన కల్పించడంలో లోపమా?
ఈ ఏడాది ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడం, ప్రత్యామ్నాయ పంటలు, సాగు విధానాలపై సూచనలు ఇవ్వడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని రైతులు అంటున్నారు.
గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించి ఉంటే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునే అవకాశముండేదని వారు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ వెంటనే స్పందించి రైతు లకు సాంకేతిక సూచనలు, అవసరమైన సహాయక చర్యలు అందించాలని కోరుతున్నారు.
రూ.70 వేల పెట్టుబడి.. ఇప్పుడు వానే ఆశ..
ఆరున్నర ఎకరాల్లో పత్తి సాగు చేసి దుక్కి, విత్తనాలు, కూలీల ఖర్చులతో కలిపి ఇప్పటికే సుమారు రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టాను. విత్తనాలు మొలకెత్తక రెండోసారి విత్తాల్సి వచ్చింది. జూన్ నెలంతా వర్షాభావమే ఎదురైంది. కనీసం జూలైలోనైనా వరుణదేవుడు కరుణిస్తాడనే ఆశతో ఎదురుచూస్తున్నాం. ఎల్నీనో ప్రభావంపై వ్యవసాయ అధికారులు ముందుగానే రైతులకు అవగాహన కల్పించి ఉంటే కొంతమేర నష్టాన్ని నివారించే అవకాశం ఉండేది.
వెంకటేశ్వర్ రెడ్డి, రైతు, మానవపాడు






