రచయిత రచనా పటిమను చాటాలి
మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. అం దులో నేను పాల్గొన్నాను. వెనుక ఎక్కడో కూర్చున్న నన్ను గుర్తించిన నరసింహారెడ్డి ఎంఏలో నా విద్యార్థి కనుక, గురుభావం తో ముందుకురమ్మని ఆహ్వానించారు. అ ప్పుడే నాకు పరిచయమైన నూతన కవుల్లో డా.దేవరాజు రాంబాబు ఉన్నారు. నా కవి త విని పరవశించిన ఆయన నన్నా ఆలింగనం చేసుకొని అభినందించారు. అప్పటి నుంచి మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తత్ఫలితంగా వారికి ‘సృష్టి స్వరాలు’ అనే నా కృతిని అంకితం చేశాను ఇటీవలినే.
కాకరాల పద్మాకర్ పుస్తకావిష్కరణకు ము ఖ్య అతిథిగా మంచిర్యాలకు వెళ్లినప్పుడు నాకు వారే తోడుగా ఉన్నారు. వారి ఆహ్వా నం మేరకు వరంగల్‌లోని కాళోజీ ఆడిటోరియంలో జరిగిన ఫార్మసీ డిపార్ట్మెంట్ స్వర్ణోత్సవాల్లో ప్రేక్షకునిగా పాల్గొని, వారి విద్వత్తును, వారి శిష్య బృందాన్ని కనులారా చూశాను. అదృష్టవశాత్తు కాకతీయ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య ప్రతాపరెడ్డి నన్ను చూసి వేదిక మీదికి రమ్మన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాతోపాటు వారు పనిచేసిన కా లంలో మా మధ్య ఎంతో మైత్రి ఉండింది.
డా.రాంబాబు సన్మాన కార్యంలో పాల్గొని, అనంతరం వారి శిష్యులను చూసినప్పుడు, దేశ దేశాంతరాలకు ఫార్మ సీ రంగంలో నిపుణులైన వారిని తయారు చేసిన గౌరవం వారిదేననిపించింది. డా. రాంబాబు మంచిర్యాల జిల్లా, చెన్నూరు వాస్తవ్యులు. 1972లో నాగ్పూర్ విశ్వవిద్యాలయంలోని ఔషధ శాస్త్ర విభాగంలో సీని యర్ లెక్చరర్‌గా చేరిన వీరు, ఆ తర్వాత 1984లో కాకతీయ విశ్వవిద్యాలయంలో 21 ఏళ్లు ఫార్మసీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేసి 125 పరిశోధనా వ్యాసా లను ప్రచురించారు. 27 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉన్నారు. ఔషధ శాస్త్ర విభాగంలో ఆచార్యులుగా ఉన్న రాంబాబు కవి ఎలా అయ్యారనే ప్రశ్న నాలో కలిగింది.
కానీ, తర్వాత తెలిసింది, వారికి 1960లో మహాకవి వాన మామలై వరదాచార్యుల గురుత్వం లభించిందని. వరదాచార్యుల ప్రభావం వల్లనే రాంబాబు పద్యకవితా నిర్మాణదక్షులయ్యారు. కరోనా కాలం (2019 21) కొం దరికి శాపమైతే, రాంబాబుకి వరదాయిని అయ్యింది. ఆ కాలంలోనే అసాధారణమైన రీతిలో వారి కలం నుంచి ’భరతో దయం’ అనే పేరుతో ఒక మహా కావ్యం వెలువడింది. శకుంతలను కావ్య నాయికగా చేసి అపూర్వమైన శృంగార కావ్యంగా ’భరతోదయం’ కావ్యాన్ని అవతరింపజేశారు రాంబాబు.
ఆధునిక కాలంలో వెలువడిన ’భరతోదయం’ కావ్యానికి ఎంతోమంది పండితు లు మొత్తం 236 పుటల్లో తమ సమీక్షలనందించారు. ఇటీవల కాలంలో ఇన్ని పుటల అభిప్రాయాలను ఏ కావ్యానికీ చూ డం. నవరసాలకు ఆలవాలమైన ఈ కావ్యం దుష్యంతుని విషయంలో సానుభూతిని ప్రదర్శించింది. పాలకులకు ఉండ వలసిన సుగుణాలను ప్రత్యేకంగా పేర్కొన్నది. ఇలాంటి మహాకావ్యాన్ని ముద్రించి, ఆవిష్కరించే కార్యక్రమాన్ని భాగ్యనగరంలోని సత్యసాయి నిగమాశ్రమంలో (12.-07.-2026) ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డి.శ్రీధర్‌బా బును ముఖ్యఅతిథిగా, జూపల్లి కృష్ణా రావును విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. డా.కె.వి.రమణాచారి అధ్యక్షతన ఉదయం పది గంటలకు మొదలైన సభలో ప్రముఖులెంతో మంది పాల్గొన్నారు. గౌరవ అతిథులతోపాటు పది మంది పండితులు, భరతోదయం కావ్యాన్ని పరిచడం చేసే కార్యక్రమం అది. అప్పటికే పది మంది వేదిక మీద ఆసీనులయ్యారు.
‘భరతోదయం’ కావ్యానికి అభిప్రాయం రాసిన వారిలో నేనూ, గిరిజా మనోహరబాబు, తుమ్మూరి ముగ్గురం ఉన్నాం. కానీ, మాకు ఆయా గ్రంథాలను పరిచయం చేయాలని వేదిక మీదికి ఆహ్వానించారు, రాంబాబు మమ్మల్ని ముందే కోరారు. మొదట ‘రాగోదయం’, ‘తొలకరి’ గ్రంథాలు ఆవిష్క రణ జరిగాక, ‘భరతోదయం’ కావ్యాన్ని ఆవిష్కరించడానికి ముఖ్య అతిథుల కోసం ఎదురుచూశాం. అదృష్టవశాత్తు నేను, గిరిజామనోహరబాబు ఇద్దరం ప్రశాంతమైన వాతావరణంలో నిండు సభలో పుస్తక సమీక్ష చేశాం. కానీ, భరతోదయ కావ్యం ఆవిష్కరణ జరగలేదు కనుక దాని మీద ఎవరూ మాట్లాడే అవకాశం లేకుండాపోయింది.
వారూ, వీరూ ఎవరైనా రాంబా బు ఫార్మసీ రంగంలో చేసిన సేవలను ప్రశంసించారే తప్ప వారి కావ్య రచనా పటిమను ఎరుకపరిచిన వారు లేరు, అసలు కార్యక్రమం భరతోదయం కావ్య ఆవిష్కరణ, తద్వారా రాంబాబు కవితా నిర్మాణ దక్షత పలువురికి తెలియజేయడం. అంద రం ముఖ్య అతిథి, విశిష్ట అతిథుల కోసం ఎదురుచూశాం. కానీ, వారు రాష్ట్ర వ్యవహారాల్లో నిత్యం తలమునకలయ్యే వారు కనుక సకాలానికి రాలేకపోయారు. అయినప్పటికీ శ్రీధర్ బాబు గారు సభకు విచ్చేసి భరతోదయం కావ్యాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాంబాబుని అభినందించారు. నవ్య సాహితీ పక్షాన సన్మానించారు.
అనంతరం సభలో పాల్గొన్న ప్రముఖులందరిని సన్మానించారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 2 గంటలు కావస్తున్నది. సన్మానాలైన తర్వాత ఉపన్యా సాలు వినే స్థాయిలో లేరు ప్రేక్షకులు. ఎప్పుడు భోజనానికి వెళ్దామా అనుకున్న వారు కనుక, చాలామంది సభలోంచి కదిలారు. రాంబాబుకి అభినందనలు చెప్పే ఉత్సాహంలో ఉన్నారు తప్ప, ప్రసంగాలు వినే పరిస్థితిలో లేరు.
సుమారు నాలుగు గంటలు నడిచిన సభలో ముఖ్యమైన కావ్యం భరతోదయం ఆవిష్కృతం సకాలానికి కాకపోవడం, దాని మీద అనుమాండ్ల భూమయ్య, కసిరెడ్డి వెంకటరెడ్డి, వీరిజారాణి, ఫణీంద్ర లాంటి పెద్దలు చక్కగా ప్రసంగించకపోవడం నాకు నిరాశ కలిగించింది. రాజకీయ నాయకులను గాని, వ్యాపారవేత్తలను గాని ఆవిష్కరణ కార్యక్రమాలకు పిలిచేటప్పుడు, వారికి ఇబ్బంది కలుగకుండా ముఖ్యఅతిథుల రూపంలో రమ్మని ఆహ్వానిస్తే బాగుంటుంది. అప్పుడు వారు సభ జరుగుతుండగా మధ్యలో ఎప్పుడైనా వచ్చి ప్రసంగించే సదవకాశం లభిస్తుంది. లేకపోతే పుస్తకం ఆవిష్కరణకు ఆలస్యం కావడం, సమీక్ష జరగకపోవడం మొదలైన ఇబ్బందులు జరుగుతాయి.
వ్యాసకర్త సెల్: 9885654381
ఆచార్య మసన చెన్నప్ప






