calender_icon.png 16 February, 2026 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివనామస్మరణతో మారుమ్రోగిన వేములవాడ క్షేత్రం

16-02-2026 12:00:00 AM

  1. దక్షిణకాశీ వేములవాడలో మహాశివరాత్రి మహోత్సవాల వైభవం
  2. భక్తి, భక్తుల సందోహంతో కళకళలాడిన శ్రీ భీమేశ్వర ఆలయం

వేములవాడ, ఫిబ్రవరి15,(విజయక్రాంతి)దక్షిణకాశీగా ఖ్యాతి గాంచిన వేములవా డలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు, పుర వీధులన్నీ ఓం నమఃశివాయ నినాదాలతో మారుమ్రోగి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

ఆలయ అధికారుల అంచనా ప్రకారం ఇప్పటివరకు దాదాపు లక్షన్నర మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా భక్తులు తండోపతండాలుగా చేరుకొని తమ మొక్కు లు తీర్చుకున్నారు. కోడె మొక్కులు, తలనీలాల సమర్పణలు, నిర్వహిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, లింగోద్భవ సమయంలో లింగార్చన కార్యక్రమాన్ని ఆలయ వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలంకరణలతో మెరిసిపోగా, భక్తుల కో సం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

క్యూలైన్లలో తాగునీరు, ప్రసాదం, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు సమకూర్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, పోలీసు శాఖ, రెవెన్యూ, వైద్య, విద్యుత్ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేశాయి. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయడంతో రాకపోకలు సజావుగా సాగాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించడం విశేషం.స్థానిక వ్యాపారులు,ట్రస్టులు అన్నదాన సేవలు, పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాయి.

అన్నదాన శిబిరాల్లో వేలాది మంది భక్తులకు భోజన వసతి కల్పించారు. భక్తుల రాకతో వేములవాడ పట్టణం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. మొత్తం మీద ఈ ఏడాది మహాశివరాత్రి వేడుకలు వేములవాడ క్షేత్రంలో భక్తి పారవశ్యానికి నిదర్శనంగా నిలిచాయి. శివనామ స్మరణతో మారుమ్రోగిన దక్షిణకాశీ మరోసారి తన ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంది.