తీరని ‘డబుల్’ కష్టాలు
- వసతుల లేమితో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల అవస్థలు
రెండేళ్లయినా తప్పని తిప్పలు
విభళ్ళపురం, అప్పన్నగూడెంలలో అదే తీరు
వసతులు కల్పించి ఇబ్బందులు తొలగించాలని లబ్ధిదారుల వేడుకలు
మోతె, మార్చి 2 : ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలను అందజేస్తుంది. దానిలో భాగంగానే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు కట్టించి అందజేసింది. ఇంతవరకు బానే ఉన్నా వాటి నిర్మాణంలో నాణ్యతతో కూడిన పనులు చేయకపోవడం, అక్కడ సరైన వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు అనేక చోట్ల అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇదే విధానం మండలంలోని విభళ్ళ పురం, అప్పన్నగూడెం గ్రామాల్లోనూ కొనసాగుతోంది.
ప్రారంభం నుంచే తప్పని తిప్పలు..
2020లో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు. ఇండ్లు పూర్తయి రెండు సంవత్సరాలైనా అర్హులైన పేదలకు పంపిణీ చేయాలేదు. దీంతో సిపిఎం ఆధ్వర్యంలో 2023లో ధర్నా నిర్వహించగా అప్పుడు అర్హులను గుర్తించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేశారు. కాంట్రాక్టర్ నాణ్యతలేని సిమెంటుతో కట్టడంతో ఆ ఇండ్లు ఇప్పుడు శిధిలావస్థకు చేరాయి.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చిన సంతోషం లేకుండా కారు చీకట్లో మగ్గుతున్న కాలనీ వాసుల దుస్థితి కి నిదర్శనం మండల కేంద్రంతో పాటు విభళ్ళ పురం, అప్పన్నగూడెం గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గత ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి ఇచ్చిన ఇండ్లు ఆర్భాటంగా ప్రారంభించి చేతులు దులుఫుకొన్నారు.
కనీస వసతులు కరువు
డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో కనీస సౌకర్యాలైన కరెంట్, త్రాగునీటి సౌకర్యం , సి సి రోడ్లు లేక వచ్చిపోయే వర్షాలతో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి బురదతో కంపు కొడుతున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. అలాగే ఈగలు, దోమలు, స్త్వ్రరవిహారం చేస్తున్నాయని, కారుచీకట్లో పాములు, తేళ్ళ బెడదతో సతమతం అవుతున్నామని లబ్ధిదారులు ఇప్పటికే పలుసార్లు మండల అధికారులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శి లకు పిర్యాదు చేసిన పలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు.
కనీసం గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చెత్త సేకరణకు రావడం లేదని దీంతో ఎక్కడ చెత్త అక్కడే పేరుకపోయి కంపు కొడుతున్నదని డబుల్ బెడ్ రూమ్ గృహ నివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు డబుల్ బెడ్ రూమ్ నివాసులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకొని అన్ని వసతులు కల్పించి అవస్థలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
వసతులు కల్పించాలి
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసి త్రాగునీరు, విద్యుత్తు, సైడ్ డ్రైనేజీలు, సిసి రోడ్లు వసతులను కల్పించకుండా వదిలేసిసింధీ. అప్పటి నుండి ఇప్పటి వరకు సమస్యలు మాత్రం తేలడం లేదు. డబల్ బెడ్ రూమ్ గృహనివాసులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వమైనా వసతులను కల్పించాలి.
- మట్టిపల్లి సైదులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు




