26 March, 2026 | 4:33 AM

అపర భద్రాద్రి.. బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

26-03-2026 12:42 AM

ముస్తాబైన శిరుసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం

నేడు ‘మాస కళ్యాణం... హాజరుకానున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

చారకొండ మార్చి 25: అపర భద్రాద్రిగా పేరుగాంచిన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిరుసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగు రంగుల విద్యుత్తు కాంతులతో దేవాలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.

బుధవారం ఆలయంలో స్వామి వారిని పెళ్లి కుమారుడిగా, సీతమ్మ తల్లిని పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసే వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష పూజల అనంతరం ఆదిదంపతులకు మంగళ స్నానాలు చేయిం చి, నూతన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించారు. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు భక్తులు తరలివచ్చారు.

నేడు మాస కల్యాణం.. హాజరు కానున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

శ్రీరామ నవమి రోజు జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మహోత్సవానికి ముందు ప్రతి సంవత్సరం ‘మాస కళ్యాణ’ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మహా కళ్యాణానికి రాలేని భక్తులు మాస కల్యాణంలో పాల్గొని తిలకిస్తారు. నేడు నిర్వహించే మాస కల్యాణ మహోత్సవానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

వేసవి ఎండల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణ లో భారీ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, ఎండ తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

బ్రహ్మోత్వనాల వివరాలు..

‘నేడు మధ్యాహ్నం 12 గంటలకు ’మాస కల్యాణం’

‘27న శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ’మహా కల్యాణోత్సవం’

‘28న శనివారం రాత్రికి ’చిన్నరథం’ (పూలతేరు)

‘29న ఆదివారం ’గరుడ సేవ’ 

‘30న సోమవారం రాత్రికి ’పెద్ద రథం’ (బ్రహ్మో త్సవం)

‘31న మంగళవారం సూర్యప్రభ వాహన సేవ, గజసేవ, దోపోత్సవం

‘01 ఏప్రిల్ బుధవారం చక్రతీర్ధం, పల్లకీసేవ, ఏకాంత సేవ

‘02న గురువారం సాయంత్రం 5 గంటలకు హనుమంత్ విజయోత్సవం (దేవాలయం నుంచి శిరుసనగండ్ల వరకు భారీ శోభాయాత్ర)

‘07న శాంతి కల్యాణం, సాయంత్రం 5 గంటలకు గుట్ట నుంచి శిరుసనగండ్లకు ఊరేగింపుతో ఉత్సవాలు ముగింపు.

ఈ అద్భుత ఘట్టాలను తిలకించేందుకు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.