ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్
భూపాలపల్లి జూలై 20 (విజయ క్రాంతి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ పట్టణంలోని పలు బూత్లను సందర్శించి ఇన్చార్జీల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ తో కలిసి ఇంటింటికీ నిర్వహిస్తున్న సర్వే, ఫారాల సేకరణ, ప్రజలకు అందిస్తున్న అవగాహన కార్యక్రమాలను పరిశీలించారు.
బూత్ ఇన్చార్జీలతో మాట్లాడి, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని, ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బట్టు కరుణాకర్ మాట్లాడుతూ, ప్రతి ఇన్చార్జి అంకితభావంతో బాధ్యతలు నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.






