20 August, 2026 | 1:48 AM

కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట

20-08-2026 12:45 AM

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆలేరు, ఆగస్ట్ 19 : కల్లుగీత కార్మికుల సంక్షేమం, భద్రతకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆలే రు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 250 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాటి చెట్లు ఎక్కే సమయంలో కల్లుగీత కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను అందిస్తోందన్నారు.

కార్మికుల ప్రాణాలను కాపాడటంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. కల్లుగీత కార్మికుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గీత కార్మిక సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు.