ఉద్యోగుల యుద్ధంలో ముందుంటాం
సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాడుతాం
నేడు కరీంనగర్‌లో వేలాది మందితో ఫీజు పోరు
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఆగస్టు19 (విజయక్రాంతి): ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే యుద్ధంలో బీజేపీ సైనికులే ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ యుద్ధంలో మీకంటే ముందు మేమే ఉంటాం. పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే ఆ దెబ్బలు మేమే తింటాం. తూటాలు పేలిస్తే ఆ తూటాలకు మేమే బలయ్యేందుకు సిద్ధం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 27 నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన పోరుబాటకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి అతిథి గ్రుహంలో బుధవారం ఉద్యోగుల జేఏసీ పోరుబాటుకు మద్దతుగా ఆయన మాట్లాడారు. బీజేపీ పక్షాన ఉద్యోగ సంఘాల జేఏసీకి సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు. రాష్ట్రం లో ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షన్ల పరిస్థితి దారునంగా ఉందని, పీఆర్సీని అమలు చేయడం లేదని, హెల్త్ కార్డులు పని చేయడం లేదని, 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగులకు రావాల్సిన దాదాపు 2 వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లించడం లేదన్నారు.
ఇప్పటికీ 317 జీవో బాధితులకు న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసుల ను అమలు చేస్తామని హామీని మర్చిపోయారని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత స్కీంను అమలు చేస్తామన్న హామీకి దిక్కు లేదన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం.. ఈనాడు కాంగ్రెస్ అట్లనే వ్యవహరించాయని మండిపడ్డారు. రెండూ మోసపూరిత పార్టీలేనని, ఉద్యోగులు పదవీ విరమణ రోజే బెన్‌ఫిట్స్ అన్నీ చెల్లిస్తామని మోసం చేశారని మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థుల పక్షాన యువ మోర్చా పోరాడుతోందని బండి సంజయ్ తెలిపారు. గురువారం వేలాది మందితో కరీంనగర్‌లో నిర్వహించే ఫీజు పోరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొంటారని చెప్పారు. కరీంనగర్ డెయిరీ విషయంలో రాజకీయ కోణంలో చూడొద్దని ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. డెయిరీని విచ్ఛిన్నం చేసేందుకు, డెయిరీ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సాఫీగా సాగుతున్న కరీంనగర్ డెయిరీని దెబ్బతీసి, ఆస్తులపై కన్నేయడం సరికాదని బండి సంజయ్ అన్నారు.






