20 August, 2026 | 2:38 AM

ఆరోగ్య బీమా పరిమితి 25 లక్షలకు పెంపు

20-08-2026 01:45 AM

5 లక్షల నుంచి అమాంతం ఐదు రెట్లు హైక్

పాల ధర లీటర్ రూ.38 నుంచి రూ.41కి పెంపు

పాడి రైతులకు ఊరట

ఎమ్మెల్యేలకు ప్రత్యేక భత్యం, కారు సౌకర్యం

ఇంధన ఖర్చులు, డ్రైవర్ వేతనం కోసం నెలకు 75,000 

తమిళనాడు ప్రజలకు సీఎం జోసెఫ్ విజయ్ వరాల జల్లు

చెన్నై, ఆగస్టు 19: తమిళనాడు ప్రజలపై సీఎం విజయ్ వరాల జల్లు కురిపించారు. ‘ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం’ వార్షిక పరిమితిని రూ. 5 లక్షల నుంచి ఏకంగా రూ. 25 లక్షలకు ఐదురెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. పాల ధరలను పెంచుతూ పాడి రైతులకు ఊరట కల్పించగా, నియోజకవర్గాల్లోని సమస్యలను తెలు సుకునేందుకు ఎమ్మెల్యేలకు ప్రత్యేక వాహనం, ఇతర ఖర్చులను అందిస్తామని చెప్పారు.

బుధవారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం విజయ్ తమిళనాడు ప్రజలకు లబ్ధి చేకూరే నిర్ణయాలను వెల్లడించారు. 110వ నిబంధన ప్రకారం ప్రజారోగ్యం అనేది ప్రయోజనం కాదని, ప్రతీ ఒక్కరి ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించారు. ఆదాయంతో ప్రమేయం లేకుండా ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్యాన్ని అందించ డానికే ఈ చారిత్రాత్మక పెంపు చేపట్టామని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ ‘ఆవిన్ పాల’ సేకరణ ధరను లీటరుకు రూ. 38 నుంచి రూ. 41కి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ, రాష్ట్రంలోని 3.16 లక్షల మందికి పైగా ఉన్న పాల ఉత్పత్తిదారులకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని తో పాటు వైద్య రంగ విస్తరణలో భాగంగా రాష్ట్రంలో వైద్య విద్యార్థుల సీట్ల సంఖ్యను కూడా పెంచనున్నట్లు తెలిపారు. శాసనసభ్యుల పనితీరు మెరుగుపరిచేందుకు, నియో జకవర్గ పర్యటనలు పారదర్శకంగా సాగేందుకు వీలుగా ప్రతి ఎమ్మెల్యేకు ఒక అధికా రిక ప్రభుత్వ వాహనాన్ని కేటాయించనున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.

ఆ వాహన నిర్వహణ, ఇంధన ఖర్చులు, డ్రైవర్ వేతనం నిమిత్తం నెలకు రూ. 75,000 ప్రత్యేక భత్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సంక్షేమ పథకాల ప్రకటనలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, విపక్షాలు మాత్రం ప్రభుత్వ ఆర్థిక వ్యయంపై దృష్టి సారిస్తున్నాయి. డీఎంకే ప్రభుత్వం పాల సేకరణ ధర పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఫైళ్లను సరైన సమయంలో బటయపెడతానని, తన బెంచ్‌పై రెండు ఫైళ్లు ఉన్నాయని, వాటిని ఇప్పుడే బయటపెట్టేలా బలవంతం చేయొద్దని చురకలంటించారు.