23 July, 2026 | 4:24 AM

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలి

23-07-2026 12:00 AM

ములుగు, జులై 22 (విజయ క్రాంతి)ములుగు గిరిజన శాసనసభ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, 2026 జూన్ 25 నుంచి బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి ఓటరు నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తున్నారని తెలిపారు. జిల్లాలో సుమారు 83.03 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బూత్ లెవల్ ఏజెంట్లు, బూత్ లెవల్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రతి బూత్ పరిధిలో మిగిలి ఉన్న ఓటర్లను మరోసారి సంప్రదించి, పెండింగ్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటైజేషన్ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఓ యాప్ ద్వారా వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, డిజిటైజ్ చేసిన ఫారాలను వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. అవసరమైన చోట రీ-విజిట్ నిర్వహించి, ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా మిగిలిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటర్ల పేర్ల చేర్పు, సవరణలు, తొలగింపులు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఓటరు మరణించినా లేదా ఇతర కారణాలతో పేరు తొలగించాల్సిన సందర్భాల్లో కూడా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి, డిడబ్ల్యూఓ ప్రేమలత, తహసీల్దార్ విజయ భాస్కర్, ఎన్నికల సిబ్బంది సలీం, నితీష్, రమాదేవి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.