కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి
బూర్గంపాడు, (విజయక్రాంతి): కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం బూర్గంపాడు మండలంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. అనంతరం బూర్గంపాడు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడబిడ్డలకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ నిలుస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల నాయకులు సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






