కిమ్ జాంగ్ ఐడియాలజీ కాంగ్రెస్‌దే
- హిట్లర్ ధోరణి ప్రదర్శిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
- బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ ధోరణిని ప్రదర్శిస్తున్నారని, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఐడియాలజీ కాంగ్రెస్‌దేనని బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఎంపీలపై అసత్య ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రోజంతా అబద్ధాలే మాట్లాడుతున్నారని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రాత్రిపూట ఎక్సెల్ షీట్లు వేసుకుని బీజేపీని ఎలా బద్నాం చేయాలో ఎజెండా సిద్ధం చేసుకుంటున్నాయని ఆరోపించారు.
శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఎన్‌వీ సుభాష్ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయాలు చూసి భయపడి, తమ తదుపరి లక్ష్యం తెలంగాణే అని గ్రహించి ఈ రెండు పార్టీలు ఉమ్మడి శత్రువుగా బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు.
వారసత్వ, నియంతృత్వ కమ్యూనిస్టు భావజాలం ఉన్న కిమ్ జాంగ్ కుటుంబానికి, నెహ్రూ--గాంధీ కుటుంబ వారసత్వ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పోలికలు సరిపోతాయని ఎద్దేవా చేశారు. గాంధీయేతర కుటుంబానికి చెందిన ప్రధానులను, అధ్యక్షులను కాంగ్రెస్ ఎలా అవమానించిందో చరిత్ర చెబుతోందన్నారు. బీజేపీలో ఒక సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కాగలరని, కాంగ్రెస్‌లో అలాంటి ప్రజాస్వామ్యం ఉందా? అని ఆయన నిలదీశారు.






