14 June, 2026 | 1:41 AM

335 మంది కారుణ్య నియామకం

14-06-2026 12:36 AM
  1. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి 
  2. కార్మికుల సంక్షేమానికి రాజీపడం 
  3. ప్రజాస్వామ్య రక్షణలో జాగరూకతతో ఉంటాం 
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  5. మంచిర్యాలలో నియామక పత్రాలు అందజేత
  6. హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి, పొన్నం

మంచిర్యాల, జూన్ 13 (విజయక్రాంతి): సింగరేణి కార్మికుల సంక్షేమం లో రాజీపడేది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ప్రజాస్వామ్య రక్షణలో జాగరూకతతో ఉంటా మని చెప్పారు.

శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్య పరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులు 335 మందికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కారుణ్య నియామక పత్రాలు అందించారు. మంచిర్యాల జిల్లాలో గూడెం సత్య నారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.70 కోట్లు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.74 కోట్ల 40 లక్షలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీపడేది లేదని, సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, ప్రజాస్వామ్య రక్షణలో జాగరుకతతో ఉంటామని తెలిపారు. వైద్యపరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన 335 మంది అర్హత గల అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని, భవిష్యత్తులో మరింత మంది అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడుకుందాం అని, తెలంగాణ ఆస్తిగా తీర్చిదిద్దుదామని తెలిపారు.

సింగరేణి కార్మికులకు కోటి 25 లక్షల బీమా అందిస్తున్నామని, 30 వేల మంది ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి బోనస్ అందించామని తెలిపారు. కోల్ బ్లాక్స్‌లలో పూర్తి నిఘా వ్యవస్థ మధ్యలో పని జరుగుతుందని, తెలంగాణ వనరులను కాపాడతామని భట్టి విక్రమార్క తెలిపారు. కోల్ బెల్ట్ ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో మాట్లాడి కార్మిక సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సమన్వయంతో సింగరేణి బొగ్గు గనులను మరింత అభివృద్ధి చేసి కార్మికుల సంక్షేమం దిశగా కృషి చేస్తామని తెలిపారు. 

సింగరేణి బొగ్గును కాపాడుకుందాం: మంత్రి శ్రీధర్‌బాబు

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను, తెలంగాణ నల్ల బంగారాన్ని కాపాడుకుందాం అని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మెడికల్ అన్ ఫిట్ విషయంలో పారదర్శకంగా ముందుకు వెళ్తామన్నారు. సింగరేణి కార్మికులకు కోటి 25 లక్షల రూపాయలతో పాటు ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి 40 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్మాని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ లాభాలలో సింగరేణి కార్మికులతో పాటు ఒప్పంద కార్మికులకు లాభాల వాటా అందిస్తున్నామని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు అందుకున్న 335 మంది లో 117 మంది మంచిర్యాల జిల్లాకు చెందిన వారు కావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. సింగరేణి సంస్థలో మారుపేరు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఒక కమిటీని నియమించి పర్యవేక్షించనున్నట్టు తెలిపారు.

బాధితులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటుందని, పదవీ విరమణ పొందిన సింగరేణి కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు అందించామని వెల్లడించారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు అందిస్తున్న కార్మికుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. సింగరేణి ప్రాంతాలలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను పదవీ విరమణ పొందిన కార్మికులకు అందించి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్నులు వెసలుబాటు కల్పించాలని, జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో గల శ్రీరాంపూర్ ప్రాంతంలో అర్హులకు పట్టాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. 1992లో సింగరేణి సంస్థను 450 కోట్ల రూపాయలకు బిఐఎఫ్‌ఆర్ కిందకు పంపించడాన్ని ఆనాడు గడ్డం వెంకటస్వామి అడ్డుకొని కాపాడారని గుర్తు చేశారు.

కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, సత్యనారాయణ, మలోత్ రాందాస్ నాయక్, సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.