14 June, 2026 | 2:29 AM

రూ.1,600 కోట్ల విలువైన, బొగ్గు ఎక్కడ? విచారణ జరిపించాలి

14-06-2026 12:47 AM
  1. సింగరేణిలో బొగ్గు అదృశ్యంపై సీఎంకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ 
  2. తక్షణ చర్యలు చేపట్టకపోతే సంస్థపై ప్రతికూల ప్రభావం 
  3. ఇప్పటికే 51,500 కోట్లు బకాయిపడ్డ తెలంగాణ 
  4. ఆర్థిక ఒత్తిడిలో సంస్థ 
  5. లోటుపాట్లను అరికట్టేందుకు సాంకేతికత  తప్పనిసరి అని సూచన

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): సింగరేణిలో దాదాపు రూ.1,600 కోట్ల విలువైన, 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందనే వార్తా కథనాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీసే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, నిజానిజాలను వెలికితీయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరా రు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. 

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి రూ.51,500 కోట్లకు పైగా బకాయి పడిందని, దీని వల్ల సంస్థ ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందన్నారు. ఈ తరుణంలో బొగ్గు మాయమైనట్లు వచ్చిన వార్తలు సంస్థ ఆర్థిక స్థిరత్వా న్ని మరింతగా దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. వీటిని తక్షణమే పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టకపోతే సింగరే ణి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు.

తద్వారా సంస్థ భవిష్యత్ అభివృద్ధి, స్థిరత్వానికి  ఆటంకం కలగవచ్చని లేఖలో స్పష్టం చేశారు. అంతేకాకుండా ‘తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యం ఉన్న సింగరేణి సంస్థకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సింగరేణి పాత్ర కీలకం. ఈ సంస్థ ద్వారా 40,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు.

అంతేకాకుండా, దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి గణనీయమైన పాత్ర పోషిస్తూ, దేశ ఇంధన భద్రతకూ విశేషంగా దోహదపడుతోంది. ఇలాంటి సింగరేణి సంస్థ.. నిరంతర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం అనేవి అత్యంత ప్రాధాన్యమైన అంశాలు. ఈ క్రమంలో, ఇటీవల కొన్ని మీడియా కథనాల్లో.. సింగరేణిలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వార్తలు ప్రచురితమయ్యాయి. ఇలాంటి వార్తల్లోని నిజానిజాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోకపోతే సింగరేణి ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది’అని లేఖలో ప్రస్తావించారు.  

ఇంటర్నల్ కంట్రోల్ సిస్టంపైన సమీక్ష చేయాలి

సింగరేణి సంస్థ సమర్థవంతమైన నిర్వహణ కోసం తగిన సేఫ్ గార్డ్స్, మెకానిజం, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టం సరిగ్గా అమలవుతుందా? అనే అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని మంత్రి కిషన్‌రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఈ సమీక్షలో టెక్నాలజీ బేస్డ్ మానిటరింగ్ టూల్స్ వినియోగించడం అవసరమని భావిస్తున్నాను. అలాగే సమయానుగుణంగా సమీక్షలను నిర్వహించడం ద్వారా లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు వీలవుతుంది.

ఇటువంటి ప్రయత్నం ద్వారా.. వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఇ లాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరోధించవచ్చు. దీంతో సంస్థ సామర్థ్యం, పారదర్శకత, విశ్వసనీయత  మరింత బలోపేతం అవుతుంది. సంస్థ సజావుగా పనిచేయడంలో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం విషయంలోనూ మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాను’ అని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.