14 June, 2026 | 2:08 AM

రైతులకు ధాన్యం సంచుల్లేవ్.. సంచులన్నీ రాహుల్‌కే!

14-06-2026 12:43 AM
  1. ప్రజాప్రభుత్వం ఫస్ట్ హాఫ్ పూర్తిగా ఫెయిల్ 
  2. రైతుబంధును బలహీన పరిచి ‘రాహుల్‌బంధు’ మొదలుపెట్టారు 
  3. తెలంగాణకు మళ్లీ కేసీఆర్ నాయకత్వం అవసరం 
  4. అధికారంలో లేకున్నా బీఆర్‌ఎస్‌కు ఆదరణ తగ్గలేదు 
  5. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి 
  6. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  7. వేములవాడ, సిరిసిల్లలో కార్యకర్తల సమావేశాలు

వేములవాడ/సిరిసిల్ల, జూన్ 13 (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో ధాన్యం సంచుల్లేక రైతులు ఇబ్బందులు పడు తుంటే, ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీకి మాత్రం సంచులకొద్దీ డబ్బులు పోతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసి డెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్‌బంధు’ మొదలుపెట్టారని, తెలంగాణ డబ్బు ను దోచుకుం టున్నారని ధ్వజమెత్తారు. శనివారం వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

డిజిటల్ సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర  సవరణ (సర్)పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ.. ప్రజాప్రభుత్వం ఫస్ట్ హాఫ్ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అయితే సెకండ్ హాఫ్‌పై ఆశలు ఉండవని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కూడా అలాగే ఉందన్నారు.

అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తాయని, ప్రజలు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను ప్రభుత్వం తరుగు పేరుతో నిలువునా మోసం చేస్తుందని ఆరోపించారు. ఎరువుల దుకాణాల వద్ద రైతులు మళ్లీ క్యూల్లో నిలబడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. 

రేవంత్‌కు డైలాగులు ఎక్కువ, పని తక్కువ

హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పుకున్న సీఎం రేవంత్ నుంచి ప్రజలు ఇంకేం ఆశించలేరని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయనకు డైలాగులు ఎక్కువ, పని తక్కువ అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి వల్లే మీనాక్షి నటరాజన్‌కు అవమానం జరిగిందని ఆరోపించారు. ప్రజలు పాలిచ్చే బర్రెను వదిలి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి పథకం కింద 15లక్షల మంది ఆడపడుచులు లబ్ధి పొందారని, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు, గురుకులాలు ఏర్పాటయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశారని పేర్కొన్నారు. వీటితో పాటు మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేశారని, రేవంత్‌రెడ్డి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అప్పు ల్లోకి నెట్టారని మండిపడ్డారు.

బతుకమ్మ చీరల పథకం వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక కోణాన్ని రేవంత్‌రెడ్డి అర్థం చేసుకోలేదన్నారు.  అధికారం లేకపోయినా బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాయని ఆరోపించారు. సర్‌పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

పెరిగిన జనాభాకు అనుగుణం గా ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరగాలని అభిప్రాయపడ్డారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల ముం దు ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని, దీనిపై ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలన్నారు. 

రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సిరిసిల్లే..

నాకు జన్మనిచ్చింది శోభమ్మ అయితే, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్క రూపాయి, చుక్క మద్యం పంచకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటింద న్నారు. ప్రాణం ఉన్నంత వరకు సిరిసిల్ల ప్రజలను మరవనని, సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.  సిరిసిల్లను కేసీఆర్ నాయకత్వం లో జిల్లాగా ఏర్పాటు చేసి రూపురేఖలు మార్చామని పేర్కొన్నారు.

తంగళ్లపల్లికి సాగునీరు తెచ్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు. డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.   సిరిసిల్లలో 287 బూత్లు ఉన్నాయని, ప్రతి బూత్ పరిధిలోని కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఈ నెల 25 తర్వాత వేములవాడ నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. ప్రతి మండలాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని హామీ ఇచ్చారు.