9 June, 2026 | 3:04 AM

హైకోర్టు తీర్పును అమలు చేయాలి

09-06-2026 01:51 AM
  1. డీఎస్సీ- 2003 టీచర్లకు ఓపీఎస్ వర్తింజజేయాలి
  2. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లేఖ

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): డీఎస్సీ 2003 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు బేషరతుగా పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు లేఖ రాశారు. డీఎస్సీ- 2003 నియామక ప్రక్రియ జనవరి 1, 2004కు ముందే ప్రారంభమైనప్పటికీ, పరిపాలనా, విధానపరమైన జాప్యాల కారణంగా పలువురు అభ్యర్థుల నియామకాలు ఆ తర్వాత పూర్తయ్యాయన్నారు.

దీంట్లో వారి తప్పేమీ లేకపోయినా, వారిని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోకి తీసుకువచ్చారన్నారు. ఈ అంశంపై బాధిత ఉపాధ్యాయులతో ఏకీభవించి రాష్ట్ర హైకోర్టు వారి వాదనలను సమర్థించి 2003 డీఎస్సీ అభ్యర్థులకు ఓపీఎస్ ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించినప్పటికీ.. ఆ తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం విచారకరమన్నారు. ఇప్పటికైనా 2003 డీఎస్సీ  ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానం అమలు చేయాలన్న కోర్టు తీర్పును గౌరవించాలని గుర్తుచేశారు.