ధాన్యం కొనుగోలు వ్యవస్థ కుప్పకూలింది
- రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా సీఎం స్పందించరా?
- మాజీ మంత్రి హరీష్ రావు
చేగుంట, మే 10 (విజయక్రాంతి): రాష్ట్రం లో ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరో పించారు. ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మెదక్ జిల్లాలోని చేగుంట మండలం కర్నాలపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులు గడిచినా కేవలం రోజు రెండు లారీలు మాత్రమే రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వర్షాలకు తడిసిన వడ్లను రైతులు మళ్లీ ఆరబెట్టినా కొనుగోళ్లు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు స్పందించడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం కనీస సమీక్ష కూడా నిర్వహించడం లేదని ఆరోపించారు. ఏసీ గదుల్లో కూర్చుని మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులే కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ విక్రయించిన రైతులకు ఇప్పటికీ చెల్లింపులు చేయలేదని, జొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదన్నారు.
సివిల్ సప్లైస్ కార్పొరేషన్లలో జరిగిన అవినీతి వల్లే ప్రస్తుతం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం వెంటనే లారీలు పంపించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల తరఫున బీఆర్‌ఎస్ నాయకులు కలెక్టరేట్లను ముట్టడిస్తామని హరీష్‌రావు హెచ్చరించారు.






