ప్రభుత్వం ద్వంద వైఖరి మానుకోవాలి
కూల్చివేతలపై ఆదర్శ్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుల ఫైర్
అమీన్ పూర్, ఏప్రిల్ 14: పటాన్చెరు నియోజకవర్గం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా చర్యలను, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ యువ నాయకుడు మాణిక్ యాదవ్కు చెందిన భవనాన్ని కేవలం బిఆర్‌ఎస్ పార్టీ వ్యక్తి అని ప్రభుత్వ భూమి పేరుతో అక్రమంగా కూల్చివేయడం అన్యాయమని అన్నారు.
అయితే ఆ స్థలం 1954 నుండి వారి పూర్వీకుల సొంతమని, భూ భారతి పోర్టల్ సహా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా కూల్చివేతలకు పాల్పడటం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని విమర్శించారు. ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.
సిద్దు అనే వ్యక్తి జీవనాధారమైన ఆర్వో ప్లాంట్ను కూల్చివేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తుంట అంజయ్య యాదవ్, జిన్నారం మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, పరమేష్ యాదవ్, నర్సింహ, అప్పల భాస్కర్, మాజీ సర్పంచ్ రాజు, అమీన్ పూర్ మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, బిజిలిపురం రాజు, బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద రాజు, శివ, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






