బంగారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
వరంగల్,(విజయక్రాంతి): గుండెపోటుతో చనిపోయిన లైసెన్స్ సర్వేయర్ బంగారయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని, బంగారయ్య భార్యకు 5 లక్షల రూపాయల పరిహారం అందించి మెరుగైన ఆరోగ్యం అందించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లైసెన్సు సర్వేయర్లు వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవుని రాజు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 6000 మంది సర్వేలను గుర్తించి శిక్షణ ఇచ్చి, తగిన ఉపాధి చూపకుండా ఏడు నెలలుగా, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో సర్వేయర్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఈ క్రమంలో మహబూబ్నగర్ కు చెందిన బంగారయ్య ఆర్థిక ఇబ్బందులు, భార్యకు మెరుగైన వైద్యం అందించే పరిస్థితి లేక మరోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరిన్ని జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి లైసెన్సు పొందిన సర్వేయర్లకు కనీసం నెలకు రూ.30 వేల ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.






