తలాపున గోదారి.. ఎండుతున్న పంట!
- సిద్దిపేట జిల్లా బద్దిపడగలో ట్యాంకర్లతో నీళ్లు పారిస్తున్న రైతులు
నిలిచిపోయిన కాల్వ పనులు పూర్తిచేయాలని వేడుకోలు
నంగునూరు, మార్చి 28(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో సాగునీటి ఎద్దడి రైతులకు కంటతడి పెట్టిస్తుంది. ఎండలు ముదురుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటి, చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతుల వేదన వర్ణనాతీతంగా మారింది. యాసంగి వరి పంట ముగింపు దశలో ఉండగా, నీరందక పొలాలు బీటలు వారుతున్నాయి.
ఉన్న నీరును రైతులు వంతుల వారీగా వినియోగించుకుంటున్నా, అది ఏ మాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రైతు తప్పేట పరుశురాములు తనకున్న అద్దెకరం వరి పంటను కాపాడుకునేందుకు ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా బయట నుంచి నీటిని తెచ్చి పొలానికి పారించారు. పెట్టిన పెట్టుబడి పోయినా పర్వాలేదు, కానీ కళ్లముందు పంట ఎండిపోతుంటే చూడలేకపోతున్నాను అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
తలాపునే గోదావరి ప్రవహిస్తున్నా.. అసంపూర్తిగా మిగిలిపోయిన కాల్వ పనుల వల్లే ఈ దుస్థితి దాపురించిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో భూసేకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ, కాల్వ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వం, సాగునీటి శాఖ అధికారులు వెంటనే స్పందించి, నిలిచిపోయిన కాల్వ పనులను పూర్తి చేసి తమ పొలాలకు నీరందించాలని బద్దిపడగ రైతులు వేడుకుంటున్నారు.




