27 May, 2026 | 1:38 AM

బహుజన రాజ్యాధికారం సాధించడమే బీఎస్పీ లక్ష్యం

27-05-2026 12:42 AM

రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్

కొల్లాపూర్ టౌన్, మే 26: దేశంలో బహుజన సమాజానికి రాజకీయ అధికారాన్ని అందించడమే బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన పార్టీ కార్యాలయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో బహుజనులు జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇంకా వెనుకబడే పరిస్థితి కొనసాగుతోందన్నారు. అణగారిన వర్గాలకు నిజమైన న్యాయం జరగాలంటే వారు రాజకీయంగా చైతన్యం చెంది అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీఎస్పీనేనని అన్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదలు, దళితులు, బీసీలు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు అమలు చేయడంలో ప్రధాన రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. బహుజన వర్గాల సమస్యల పరిష్కారానికి బీఎస్పీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత విస్తరించేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి రావాలని, సమాజ మార్పుకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.