27 February, 2026 | 1:05 AM

రైతులకు నాణ్యమైన మొక్కలు అందించి అధిక దిగుబడి సాధించడమే లక్ష్యం

26-02-2026 12:19 AM

అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించిన టిజి ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి

దమ్మపేట, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని బుధవారం తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పామాయిల్ నర్సరీలు ప్రవేటు కాంట్రాక్టర్లు నిర్వహించేవారని, దాంతో కొంత మంది రైతులు ఇబ్బంది పడ్డారని, ఈ సారి అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలనే లక్ష్యంతో లేటెస్ట్ టెక్నాలజీతో ఆయిల్ఫేడ్ సిబ్బంది పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, నాణ్యత లోపం లేకుండా, మంచి మొక్కలను రైతులకు అందించాలనే లక్ష్యంతో నారంవారిగూడెం పామాయిల్ నర్సరీలో 12 లక్షల మొక్కలు నాటి రెండవ దశ మొదలైందన్నారు.

ఈ మొక్కలు అత్యంత నాణ్యతతో కూడుకున్నవని, వామ్ (VAM) మొదలగు ఫెర్టిలైజర్లు వాడుతున్నామని, భవిష్యత్తులో 30 సంవత్సరాల వరకు తెగుళ్లను తట్టుకోగలవని, తద్వారా రైతులు అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. గత సంవత్సరం  3 లక్షల టన్నుల ఫ్రూట్ క్రషింగ్ జరిగితే, ఈ సంవత్సరం 4 నుండి 5 లక్షల టన్నుల ఫ్రూట్ క్రషింగ్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆయిల్ ఫెడ్ సిబ్బంది తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని, 200 మంది సిబ్బంది ఉండాల్సిన ఆయిల్ ఫెడ్ లో 38 మందితో పనిచేస్తున్నామన్నారు.

సిబ్బందికి జీతాలు కూడా పెంచడం లేదని తెలిపారు.  అదేవిధంగా ఖమ్మం జిల్లా వేంసూరు మండలం, కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు శరవేగంగా పనులు సాగుతున్నవని తెలిపారు.  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో టి జి ఆయిల్ ఫెడ్ ను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.  ఎవరో చెప్పుడు మాటలు విని రైతులు అధైర్య పడవద్దని, 30 సంవత్సరాలు కొడుకు వుంటే కుటుంబానికి ఎంత ధైర్యం ఉంటుందో,  పామాయిల్ మొక్క నాటి నాలుగు సంవత్సరాలు పెంచితే రైతు కుటుంబానికి 30 సంవత్సరాల వరకు భరోసా ఉంటుందని తెలిపారు.

ప్రతీ పంటకు మార్కెటింగ్, మద్దతు ధర,పంట మార్పిడి, ప్రకృతి వల్ల సమస్యలు ఉన్నాయని, పామాయిల్ పంటకు మాత్రం అటువంటి సమస్యలు లేవని, పామాయిల్ ఫ్రూట్ తోలిన మూడు రోజుల్లో డబ్బులు రైతు అకౌంట్లో జమ అవుతుందని, ప్రతి ఎకరాకు లక్షా యాభై వేల రూపాయలు వచ్చే పంట ఆయిల్ పామ్ మాత్రమేనని తెలిపారు. ఈ సమావేశంలో టి జి ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టి. సుధాకర్ రెడ్డి, అప్పారావు పేట పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు తదితరులు ఉన్నారు.