20 March, 2026 | 3:57 AM

Breaking News

కన్నుల పండువగా గద్దర్ అవార్డులు

20-03-2026 01:53 AM

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేకంగా నిలిచే ఉగాది ఇది. పరాభవ నామ సంవత్సర ఆరంభం వేళ రాష్ట్ర అత్యున్నత సినిమా పురస్కారాల ప్రదానోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. ‘తెలంగాణ గద్దర్ సినీ అవార్డు’ (టీజీఎఫ్‌ఏ ప్రదానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. గురువారం సాయంత్రం ఈ వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో కన్నుల పండువగా జరిగింది.

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేక పురస్కాలు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు వంటి పలు ప్రధాన అవార్డుల ప్రదానం జరిగింది. ఎన్టీఆర్ జాతీయ అవార్డును చిరంజీవికి, పైడి జయరాజ్ పురస్కారాన్ని కమల్ హాసన్‌కు, బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డు-ను సింగీతం శ్రీనివాసరావుకు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును అశ్వనీదత్‌కు, కేఎల్ కాంతారావు ఫిల్మ్ అవార్డును -ఆర్ నారాయణమూర్తికి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును రమేశ్ ప్రసాద్‌కు, సీ నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డును సుద్దాల అశోక్ తేజకు, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డును జయసుధకు అందజేశారు.

ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, సినీ పుస్తకాలు, స్పెషల్ జ్యూరీ అవార్డులను, విభాగాల కమిటీల చైర్మన్లు, సభ్యులకు గోల్డ్, సిల్వర్, నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాల ప్రదానం జరిగింది. అంతకుముందు కార్యక్రమంలో అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించి, అవార్డుల వేడుక సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మల్లు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ఎండీ ప్రియాంక, పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

తారల సందడి.. సాంస్కృతిక ప్రదర్శనలు.. 

బాలీవుడ్ ప్రముఖులు మాధురీ దీక్షిత్, ఈషా గుప్తా, టాలీవుడ్ అగ్ర నటుడు నాగార్జున అక్కినేనిఅమల దంపతులు, నటుడు రామ్‌చరణ్, ఖుష్బూ సుందర్, నిర్మాత అల్లు అరవింద్, శోభితా ధూళిపాళ, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దంపతులు హాజరై విజేతలకు అవార్డులను అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో మధ్య మధ్యలో వేదికపై పలువురి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఆపాత మధుర గీతాలన్నీ కలగలిపి తన ప్రత్యేక నృత్య ప్రదర్శనతో వేదికకు అలంకణ తీసుకొచ్చింది అందాల తార నిధి అగర్వాల్. వనజా ఉదయ్ నృత్యబృందం తెలంగాణ సాంప్రదాయ కళా ప్రదర్శనలతో అలరించింది. నభా నటేశ్, దక్ష నాగర్కర్ బృందం ‘నాగబంధం’ చిత్రంలోని ‘నమోరే’ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. శ్రేయా ఘోషల్, దేవిశ్రీప్రసాద్, మంగ్లి సంగీత ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన వేదికపై సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రెడ్ కార్పెట్ హోస్టులుగా నిఖిల్ విజయేంద్ర, దౌలత్ సుల్తానా ఆహూతులకు స్వాగతం పలికారు. 

అంతర్జాతీయ స్థాయిలో సినీ పరిశ్రమ అభివృద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి 

గద్దర్.. ప్రజా యుద్ధనౌక. గద్దర్ అనే ఒక పేరు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించిన గొప్ప గళం. సినీ నటుల ప్రతిభను గౌరవిస్తూ వారికి గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఇవ్వాల్సిన అవసరాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. సమాజంలో ఉన్న రుగ్మతలు, సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడానికి సినిమా ఒక ఆయుధం.

సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ కృషి చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమ శాశ్వతంగా హైదరాబాద్ నగరంలో వేళ్లూనుకునే విధంగా రామోజీరావు తీవ్రంగా కృషి చేశారు. వారితో పాటు సినీ కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధికి ప్రభాకర్ రెడ్డి, దాసరి నారాయణరావు పాటుపడ్డారు. నెక్ట్స్ జీసీసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నారంటే..

హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్టే. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ ప్రాముఖ్యతను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను ప్రోత్సహించి, సినిమా నిర్మాణానికి సంబంధించి అన్ని అనుమతులు ఇవ్వడానికి సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తోంది. ఎవరైనా సినిమా నిర్మించాలనుకుంటే కథతో వస్తే.. రీల్స్ బయటకు వెళ్లడానికి ఎన్నో సంస్థలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి” అని సీఎం గుర్తు చేశారు. 

పక్క రాష్ట్రం వెనుకబడింది: చిరంజీవి

‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్‌గా ఉంటూ చాలా హృద్యంగా, కళకళలాడేలా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నా కృతజ్ఞతలు. అవార్డుల గ్రహీతలందరికీ నా అభినందనలు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. కళాకారులు గౌరవించబడే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందనేది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, ఒకానొక సమయంలో నిర్లక్ష్యానికి గురైన సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించటం అభినందనీయం.

ఇండియన్ సినిమా అనగానే హైదరాబాద్ గుర్తుకొచ్చేలా బృహత్ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రికి సినీ పరిశ్రమ చేదోడువాదోడుగా ఉంటుంది. సినిమా పరిశ్రమలో ఉత్సాహాన్ని నింపే క్రమంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కొంచెం వెనుకబడి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గద్దర్ అవార్డుల వేడుకను స్ఫూర్తిగా తీసుకొని సినిమా అవార్డులు అందించే విషయమై ఆలోచించాల్సిన అవసరం ఉంది” అన్నారు. 

కళకారులు సమాజానికి దిక్సూచిగా ఉండాలి: కమల్‌హాసన్ 

విభిన్న స్వరాలు వర్ధిల్లడానికి సృజనాత్మక వాతావరణాన్ని కల్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అభినందనీయులు. గద్దర్ అవార్డులకు నామినేట్ అయిన వారందరికీ ధైర్యం, సృజనాత్మకత ఉండాలని ఆకాంక్షిస్తున్నా. కళాకారులు సమాజానికి దిక్సూ చిగా ఉండాలి. నేను 16 ఏళ్ల వయసులో సినిమాల కోసం హైదరాబాద్ వచ్చాను. డ్బ్బుల నుంచి తెలుగు సినిమాతో నాకు అనుబంధం ఉంది.