calender_icon.png 13 February, 2026 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు

13-02-2026 12:57:07 AM

నేటి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూపులు

అంఛనాలు ఫలించేనా..?

మంచిర్యాల, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 60 డివిజన్లకు, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీల పరిధిలోని 89 వార్డులకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 2,94,297 (పురుషులు 1,45,403, మహిళలు 1,48,867, ఇతరులు 27) మంది ఓటర్లుండగా 2,01,875 ( పురుషులు 99,759, మహిళలు 1,02,110, ఇతరులు 6) మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా 68.60 శాతం పోలింగ్ కాగా మంచిర్యాల కార్పొరేషన్ లో 64.90 శాతం, బెల్లంపల్లి మున్సిపాలిటీలో 74.86 శాతం, చెన్నూర్ లో 75.85 శాతం, క్యాతనపల్లిలో 71.87 శాతం, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 76.80 శాతం పోలింగ్ జరిగింది. ఫలితాలు ఈ నెల 13న ఉండటంతో మెజార్టీ అభ్యర్థులందరు భయట పడుతామా! లేదా! అనే సందిగ్ధంలో ఉన్నారు. జిల్లాలోని కార్పొరేషన్ తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లోని 149 వార్డులకు 693 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

ఇందులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి 148 మంది అభ్యర్థులు, బీఆర్‌ఎస్ నుంచి 139 మంది, బీజేపీ నుంచి 132 మంది, ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి 28,  బీఎస్పీ నుంచి 18, సీపీఐ నుంచి 17, జనసేన నుంచి 16, ఆప్ నుంచి తొమ్మిది మంది, ఏఐఎంఎం నుంచి నలుగురు, ఇతర పార్టీల నుంచి ఎనిమిది మంది, ఇండిపెండెంట్లు 168 మంది ఎవరి స్థాయిలో వారు ఓట్లు దండుకున్నారు. వీరి భవిష్యత్తు అంతా జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లోని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఈ నెల 13న లెక్కింపు ఉండటంతో అభ్యర్థులందరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

లక్షలు ఖర్చు చేసినా ఫలితాలు వెలువడేంత వరకు ఊపిరి బిగపట్టుకొని ఉండాల్సిన పరిస్థితే అధిక వార్డుల్లోని అభ్యర్థులకు నెలకొంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు ప్రారంభించేందుకు అధికారులు అంతా సిద్ధం చేయగా అభ్యర్థులు మాత్రం తన వార్డులో ఎవరు గెలుస్తారు, పోలింగ్ అయిన వాటిలో రెబల్స్ రూపంలో ఇండిపెండెంట్లు ఎంత చీల్చారు, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పడ్డాయని లెక్కింపులు వేస్తూ ఆందోళనలోనే నేడు వెలువడనున్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 

అంఛనాలు ఫలించేనా..?

జిల్లా వ్యాప్తంగా 68.60 శాతం పోలింగ్ నమోదు కాగా గెలుపు, ఓటములపై అభ్యర్థులు అంఛనాలు వేసుకుంటున్నారు. ఆయా డివిజన్ లు, వార్డుల్లోని పోలింగ్ బూతుల్లో పోలైన ఓట్లను గమనిస్తూ ఏ పార్టీకి ఏ బూత్ లో పట్టు ఉంది, ఆయా పార్టీలకు ఎంత పడి ఉంటాయి, తనకెన్ని ఓట్లు పడ్డాయో లెక్కలు వేస్తున్నారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు వేసిన పతకాలు బెడిసి కొట్టాయా! లేక సక్సెస్ అయి ఉంటాయా! అని బంధువులను, కుటుంబ సభ్యులకు ఫోన్ లు చేస్తూ గెలుపు, ఓటములపై విశ్లేషణలు చేస్తున్నారు.

మరో వైపు అధిక సంఖ్యలో అభ్యర్థులు విజయం నాదే అనే ధీమాను భయట వారికి వ్యక్తం చేస్తూనే లోలోపల గుబులు చెందుతూ కనిపించారు. ఒక వేల క్రాస్ ఓటింగ్ జరిగితే పరిస్థితి ఏంటీ అనే సందేహాలను సైతం దగ్గరి వారితో చర్చించడం కనిపించింది. ఏదీ ఏమైనా పోటీలో ఉన్న అభ్యర్థుల ఎత్తులు ఏ మేరకు విజయవంతమయ్యాయో నేడు తేలనుంది.