29 July, 2026 | 12:54 PM

నమ్మిన స్నేహితుడికే ఘోర వెన్నుపోటు

29-07-2026 11:57 AM

అటవీశాఖ అధికారి ఇంట్లో రూ.26 లక్షల చోరీ.. 

మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ప్రధాన అనుచరుడు, మంథని మాజీ జడ్పీటీసీ భర్త శంకర్‌లాల్ అరెస్ట్!

కరీంనగర్/మంథని, జూలై 29(విజయక్రాంతి): స్నేహమంటే నమ్మకం.. కానీ ఆ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని ప్రాణస్నేహితుడికే కోలుకోలేని దెబ్బకొట్టాడో కిలాడీ. అటవీశాఖ అధికారి ఇంట్లో ఏకంగా రూ.26 లక్షల నగదు దొంగిలించిన ఘటనలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రధాన అనుచరుడు, మంథని మాజీ జడ్పీటీసీ సుమలత భర్త తగరం శంకర్ లాల్ అసలు రంగు బయటపడింది. స్నేహం ముసుగులో వచ్చి లక్షల రూపాయలు గుల్ల చేసిన ఈ ఘాతకుడి లీలలు. రాసలీలలు ఇప్పుడు ఈ  ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంథని 

మండలంలోని ఎగ్లాస్‌పూర్ గ్రామానికి చెందిన అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి గుడిమల్ల శ్రీనివాస్ కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలో అద్దెకు ఉంటున్నారు. ఇటీవలే తన వ్యవసాయ భూమిని రూ.26 లక్షలకు విక్రయించిన శ్రీనివాస్, ఆ నగదును భద్రంగా ఇంట్లోని ఖాళీ నీళ్ల డ్రమ్ములో దాచుకున్నారు. అయితే, ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్న నేపథ్యంలో, శ్రీనివాస్ ఇంటికి వచ్చి వెళ్లే పాత స్నేహితుడు, మాజీ జడ్పీటీసీ భర్త శంకర్ లాల్ ఈ విషయంపై కన్నేశాడు.

దొంగతనం వెలుగులోకి వచ్చిందిలా...

తాళం వేసి ఉన్న ఇంటిలోకి చొరబడిన శంకర్ లాల్, రూ.26 లక్షల నగదుతో పాటు కింద అంతస్తులోని ల్యాప్‌టాప్‌ను కూడా ఎత్తుకెళ్లాడు. అనుమానంతో పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ల్యాప్‌టాప్ దొంగిలించిన వ్యక్తే నగదును కూడా కాజేసినట్లు స్పష్టమైంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన కరీంనగర్ రూరల్ పోలీసులు, దర్యాప్తులో శంకర్ లాల్ దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారించి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

నాన్ బెయిలబుల్ కేసు నమోదు!

నమ్మించి నిలువునా ముంచేసిన శంకర్ లాల్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నమ్మిన వాళ్లను ఇంత ఘోరంగా మోసం చేస్తారా..అంటూ స్థానిక ప్రజలు శంకర్ లాల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.