విద్యా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి
కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు, మే 11, (విజయక్రాంతి): పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విద్యా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులు ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు సోమవారం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించి పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు పలు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. జూలూరుపాడు మండలం దండు తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ.2 లక్షల వ్యయంతో చేపట్టనున్న బాలుర మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పాపకొల్లు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ చేపట్టనున్న ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు శిబిరాల్లో చురుకుగా పాల్గొంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. జూలూరుపాడు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, కళాశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ, సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు ప్రధానోపాధ్యాయులు ఎస్కే మీరా సాహెబ్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






