ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఐసీడీఎస్ సూపర్వైజర్ శంకరమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.
పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఈ కాలంలో నీరు కూడా అవసరం లేదని పేర్కొన్నారు. తల్లిపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని, ఇవి శిశువు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడతాయని అన్నారు.
అలాగే దగ్గు, జలుబు, డయేరియా వంటి అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు మెదడు అభివృద్ధి, శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. తల్లిపాల ప్రాధాన్యతపై ప్రతి తల్లి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. ఏ. వాహిని, ఐసీడీఎస్ సూపర్వైజర్ శంకరమ్మ, వార్డు సభ్యుడు ముష్కరి రమేష్, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, బాలింతలు, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






