యుద్ధరంగంలో డ్రోన్ గేమ్‌ఛేంజర్
ఆర్థిక, వ్యవసాయ శాఖల్లో డ్రోన్ కీలక పాత్ర
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
గోల్డ్ ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు
పుట్టపర్తి, మే 15: యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల్లోనూ డ్రోన్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఏపీలో రూ.480 కోట్లతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్‌సిటీ అని సీఎం చంద్రబాబు తెలిపారు. గోల్డ్ ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శుక్రవారం రాజ్‌నాథ్ సింగ్ సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఆయుధ ఉత్పత్తిలో స్వావలంబన దిశగా భారత్ అధ్యయనం చేస్తోందన్నారు. రక్షణశాఖలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనేది కేంద్ర లక్ష్యమని ఉద్ఘాటించారు. గత పదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య అంతరం తగ్గించడానికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. డ్రోన్ హబ్‌గా కర్నూలు ఉంటుందని స్పష్టం చేశారు.
ఆ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రం సహకారంతో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారుకాబోతుందన్నారు. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్‌సిటీ అన్నారు. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్‌సిటీలో 600 కిలోలు, వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తామన్నారు. బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.






