calender_icon.png 7 February, 2026 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువు 3 వారాలే!

07-02-2026 01:57:56 AM

  1. మార్చి వరకు గడువు ఇవ్వలేం: సుప్రీం కోర్టు
  2. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ
  3. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టు ధిక్కరణ చర్యలకు ఆలోచిస్తామని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౬: ‘వాయిదాల పర్వం ఇక చాలు.. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియకే స్పీకర్ పెద్దపీట వేయాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కోర్టు ఆదేశాలు అమలు చేయాలి. స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ తరఫు అడ్వొకేట్ కోరిన విధంగా మార్చి వరకు గడువు ఇవ్వలేం. కేవలం మూడు వారాలు గడువు ఇస్తున్నాం. స్పీకర్ ఈసారి నిర్ణయం తీసుకోకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తాం.

ఇది స్పీకర్‌కు చివరి అవకాశం’ అని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. తెలంగాణకు చెందిన 1౦ మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లాతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఇరుపక్షాల వాదనలు విన్నది.

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ కచ్చితంగా పాటిస్తారని ఆశిస్తున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఒకవేళ స్పీకర్ ఆ ఆదేశాలను అమలు చేయని పక్షంలో, కోర్టు ధిక్కరణ చర్యలపై ఆలోచించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌కు ఉందని ధర్మాసనం నొక్కి చెప్పింది. 

తెలంగాణ ప్రభుత్వ తరఫు అడ్వొకేట్ వాదనలు

తెలంగాణ ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తొలుత తన వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటి షన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్దం ప్రసాద్‌కుమార్ ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని కోర్టుకు విన్నవించారు. ఆ నిర్ణయాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారని ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని, దీంతో మిగిలిన ఇద్దరి పిటిషన్ల విచారణకు వ్యవధి కావాలని ధర్మాసనాన్ని కోరారు. మార్చి వరకు గడువు ఇస్తే స్పీకర్ విచారణ పూర్తి చేస్తారని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ తరఫు అడ్వొకేట్ వాదనలు

రాష్ట్రప్రభుత్వ తరఫు అడ్వొకేట్ వాదనలను బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది మోహి త్‌రావు బలంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనర్హత పిటిషన్ల విషయంలో తెలంగాణ స్పీకర్ కావాలనే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారని ఉదాహరించారు.

మరొక ఎమ్మెల్యే తన కుమార్తెను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపి, ఆమెను గెలిపించేందుకు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారని స్పష్టం చస్త్రశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా, తామి ప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉన్నామంటూ అసత్యాలు చెబుతున్నారని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సైతం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది.

స్పీకర్ తీసుకున్న ‘క్లీన్ చిట్’ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం స్ఫూర్తిని స్పీకర్ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. నాలుగు వారాల్లో ప్రక్రియ ముగిస్తామని గతంలో చెప్పి, ఇప్పుడు మళ్లీ సాకులు వెతుకుతున్నారని కోర్టుకు వివరించారు. ప్రజాస్వా మ్యంలో ఇలాంటి జాప్యం సరైన సంకేతాలను ఇవ్వదని వాదించారు. 

గడువు పెంపునకు ధర్మాసనం.. నో!

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ తరఫు అడ్వొకేట్ సింఘ్వీ కోరినంత సమయం ఇచ్చేందుకు నిరాకరించింది. కేవలం మూడు వారాల గడువు మాత్రమే ఇస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ లోపు స్పీకర్ ఒక నిర్ణయం ప్రకటించాల్సిందేనని సూచించింది. రాజకీయ ప్రయోజనాల కంటే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.

తదుపరి విచారణ నాటికి పూర్తి స్థాయి నివేదికతో రావాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో స్పీకర్‌కు ఇదే చిట్టచివరి అవకాశమని హెచ్చరించింది. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు ఆలోచిస్తామని తెలిపింది. మరోవైపు సోషల్ మీడియాలో కోర్టు విచారణలపై ఎలాంటి రీల్స్ చేయొద్దని చేయవ ద్దని పిటిషనర్లకు ధర్మాసనం మౌఖికంగా సూచించడం గమనార్హం.