8 June, 2026 | 4:56 AM

ఆపరేషన్‌కు వెళ్లిన కూతురు.. కన్నీటి జ్ఞాపకంగా మిగిలింది

08-06-2026 12:27 AM
  1. మా బిడ్డను కడుపు నొప్పితో తీసుకెళ్లాం.. శవంగా తిరిగి ఇచ్చారు
  2. కన్నీరు మున్నీర్ తల్లిదండ్రులు, బంధువులు 
  3. ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన కార్యక్రమం 
  4. ఆర్డివో నచ్చచెప్పినా వెనక్కి తగ్గని వైనం 
  5. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు

గద్వాలటౌన్, జూన్ 7: ఇంట్లో అందరి ముద్దుబిడ్డ. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, కలలు. కడుపు నొప్పితో బాధపడుతుండటంతో వైద్యం చేయించాలనే ఆందోళనతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు చివరికి తీరని విషాదం ఎదురైంది. శస్త్రచికిత్స అనంతరం 17 ఏళ్ల ఇందు మృతి చెందడంతో ఎర్రవల్లి మండలంలోని ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం జిల్లా ఆసుపత్రి ఎదుట కనిపించిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేశాయి.

కూతురి మృతదేహం వద్ద కూర్చొని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ‘నిన్నటి వరకు మాతో మాట్లాడిన మా బిడ్డ ఈరోజు ఇలా నిర్జీవంగా మారిపోతుందని ఊహించలేదని ‘ అంటూ తల్లి కన్నీరుమున్నీరైంది. తండ్రి గుండెలు బాదుకుంటూ ‘మా కూతురి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?‘ అని ప్రశ్నించగా అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె ప్రాణాలు తీసిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.

న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. మృతురాలి ఫొటోను చేతబట్టి రోదిస్తున్న మహిళల దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి.ఈ నిరసనలతో ఆర్వోబీ రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అయినప్పటికీ తమ ఆవేదనను వ్యక్తం చేయడమే ముఖ్యమని భావించిన కుటుంబ సభ్యులు అక్కడి నుంచి కదలలేదు. మాకు పరిహారం కాదు మా బిడ్డను తిరిగి తీసుకురాగలరా? అంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఆర్డీవో శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు.

కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటా మని కూడా చెప్పారు. అయితే ఆ హామీలతో సంతృప్తి చెందని బాధిత కుటుంబం న్యాయం కోసం నిరసన కొనసాగించింది. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, బంధువులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరిని అదుపు లోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.

కూతురి మృతితో ఒక కుటుంబం శోకసంద్రంలో మునిగిపోగా, ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరి మనసును కలచివేశాయి. న్యాయం కోసం ఆ కుటుంబం చేస్తున్న పోరాటం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.