రాగిరేకుల శాసనం గోన గన్నారెడ్డిది కాదు!
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వెంకటాయపల్లిలో లభించిన ఎనిమిది రాగిరేకుల శాసనం గోన గన్నారెడ్డి దానశాసనంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, దానికి చారిత్రక ఆధారాలు లేవని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తేల్చింది. ఈ శాసనం కరీంనగర్ జిల్లా శాసనాల అధికారిక జాబితాలో కూడా లేదని పేర్కొంది. రాగిరేకుల శాసనాన్ని పరిశీలించి, విశ్లేషణ చేసిన కొత్త చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్.. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ శాసనం నందినాగరి లిపిలో, సంస్కృత భాషలో 85 పంక్త్తులతో యజేశ్వరుడు ఈ శాసనాన్ని లిఖించాడు. ప్రస్తుతం ఈ శాసనం కరీంనగర్ జిల్లా వారసత్వ శాఖ మ్యూజియంలో భద్రపరిచి ఉంది. ఈ శాసనాన్ని దివంగత నమిలికొండ హరిప్రసాద్ పరిష్కరించారు.
శాసనంలోని వివరాల ప్రకారం, దాది గన్నయ చవపతి చింతలూరు అగ్రహారాన్ని వివిధ గోత్రాలకు చెందిన 19 మంది బ్రాహ్మణులకు శక సంవత్సరం 1186, రక్తాక్షి నామ సంవత్సరం పుష్యమాసంలో సంభవించిన చంద్రగ్రహణ సమయంలో అంటే క్రీ.శ. 1264 మార్చి 29న దానంగా ఇచ్చాడు. ఈ శాసనంలో చింతలూరు అగ్రహారం సరిహద్దులను కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
రుద్రమదేవి కాలానికి చెందినదే..
శాసనంలో కాకతీయ వంశ చరిత్ర ప్రోలరాజు నుంచి రుద్రదేవుడి వరకు వివరించబడింది. ఇందులో రుద్రదేవుడు, మహదేవుడు యుద్ధంలో మరణించినట్లు ఎక్కడా ప్రస్తావించ లేదు. అలాగే గణపతిదేవుడి దౌహిత్రుడు రుద్రదేవుడని మాత్రమే ఉంది. ఈ రుద్రదేవుడు రుద్రమదేవి కాదని, ప్రతాపరుద్రుడన పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే ఈ శాసనం క్రీ.శ. 1264 నాటిదై ఉండటం వల్ల అది రుద్రమదేవి పాలనాకాలానికి చెందినదే కావడం గమనార్హం.
రుద్రదేవుడు ఎవరు?
రుద్రదేవుని ఏలుబడిలో వెన్నయ కుమారుడు జమదగ్నికి తమ్మయ్య, జక్కయ్య, గన్నయ్య, గన్నయ్య, నాగయ్య అనే ఐదుగురు కుమారులు ఉన్నట్లు శాసనంలో పేర్కొన్నారు. వారిలో పిన్నగన్నయ్య సింహబలుడు, చవనాథ పదవిని నిర్వహించినవాడని, అతడే ఈ దానశాసనానికి దాతగా ఉన్నట్లు స్పష్టంగా నమోదు చేశారు. రుద్రమదేవి సేనానుల్లో దాది సోమన ప్రస్తావన ఉన్నట్లే, ఈ శాసనంలో కూడా గన్నయ చవపతిని దాది గన్నయగా పేర్కొన్నారు.
అంటే దాది గన్నయ పాలకుడు కాకుండా సైన్యాధిపతి మాత్రమేనని శాసన ఆధారాలు సూచిస్తున్నాయి. చరిత్రలో గోనగన్నారెడ్డిని ఎక్కడా ఈ విధంగా పేర్కొనలేదని హరగోపాల్ వివరించారు. గోనగన్నారెడ్డి వర్ధమానపుర పాలకుడిగా ప్రసిద్ధుడని, ఈ శాసనంలో కనిపించే ‘గన్నయ్య’ అనే పేరు నామసామ్యమే తప్ప గోనగన్నారెడ్డితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అందువల్ల వెంకటాయపల్లిలో లభించిన ఈ రాగిరేకు శాసనాన్ని గోనగన్నారెడ్డి దానశాసనంగా పేర్కొనడం చారిత్రకంగా సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
విషయాధారం: సంకేపల్లి నాగేంద్రశర్మ రచించిన వేములవాడ క్షేత్ర చరిత్ర గ్రంథంలోని ‘గోన గన్నారెడ్డి రాగిరేకు ల శాసనంతో అనువంశిక అర్చకులకు సంబంధం --ఒక విశ్లేషణ’ (పేజీలు 32--44) ఆధారంగా ఈ వివరాలను శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు.
శ్రీరామోజు హరగోపాల్,
కన్వీనర్, కొత్త తెలంగాణ
చరిత్రబృందం
99494 98698






