జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎంతో గౌరవించింది
- పార్టీని వీడొద్దని అధిష్ఠానం నచ్చజెప్పినా వినలేదు
- సీఎం మార్పు కోరుతున్నారనడం ఆయనకు తగదు
- సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రెండేళ్లలోనే సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు మార్పు కోరుతున్నారని జీవన్‌రెడ్డి మాట్లాడడం సమంజసం కాదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాలలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘానబట్ల దినేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణిశ్రీనివాస్‌తో కలిసి మంత్రి విలేకరుల సమా వేశంలో మాట్లాడారు.
బీఆర్‌ఎస్ పార్టీపై జీవన్‌రెడ్డి విమర్శలు చేసినట్టు ఎవరూ చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవించిందని, పార్టీ వీడొద్దని కాంగ్రెస్ అధిష్ఠానం నచ్చజెప్పినా కేసీఆర్‌తో చేసుకున్న లోపాయకారి ఒప్పందం మేరకు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి లక్ష్మణ్ ఆరోపించారు.
ఏ నాయకుడి వద్దకు కూడా పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ నేతలు వెళ్లి నచ్చజేప్పలేదని, జీవన్‌రెడ్డిపై ఉన్న గౌరవంతో ఆయన ఇంటికి వెళ్లారని తెలిపారు. రేవంత్‌ను ఓడిస్తానంటే ప్రజలు గమనిస్తున్నారని మంత్రి చెప్పారు. సామాన్య కార్యకర్తలకు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని, దానికి నిదర్శనం ‘నేనే’ అని మంత్రి పేర్కొన్నారు.
ముందు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో కేటీఆర్
రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీనీ ప్రజలు కోరుకుంటున్నారని.. అధికారంలోకి వస్తుందని కలలు కనకండని మంత్రి లక్ష్మణ్ కుమార్ కేటీఆర్ నుద్దెశించి మాట్లాడారు. ‘నువ్వు తపస్సు చేసినా సీఎం కాలేవు’ అని హితవు పలికారు. ‘నువ్వు సీఎం కావాలంటే మీ బావ హరీశ్‌రావు అడ్డుపడుతారన్నారు. మళ్లీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే’ అని అడ్లూరి స్పష్టంచేశారు. కేసీఆర్‌కు దీటైనా నాయకుడు రేవంత్‌రెడ్డి అని భావించి కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడిని చేస్తే, కస్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారాని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీకి బీసీని ప్రెసిడెంట్ చేస్తారా..దళితుడిని సీఎం చేస్తారా.. అని మంత్రి బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని నిలదీ శారు. ఎస్సీ, బీసీ, ఉద్యమకారులను కేసీఆర్ దగ్గరికి కూడా రానివ్వలేదని మండిపడ్డారు. సమావేశంలో జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు దుమల రాజ్‌కుమార్, నవీన్, లక్ష్మీనారాయ ణ, కొత్త మోహన్, బాల ముకుందo తదితరులు పాల్గొన్నారు.




