కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
కుత్బుల్లాపూర్, మే 18 (విజయక్రాంతి): హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 రంగారెడ్డినగర్ డివిజన్, ఆదర్శ్ నగర్లోని జలమండలి కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వివిధ కాలనీల వాసులు, బస్తీ వాసులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వాసులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, బిఆర్‌ఎస్ శ్రేణులు, భారీగా పాల్గొని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ త్రాగునీటి సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు 24 గంటల త్రాగునీటి సరఫరా అందిస్తామని హామీ ఇచ్చి, ఆ హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
కాలనీలు, బస్తీలలో పాత మురుగునీరు వ్యవస్థ ఉండడంవల్ల సామర్ధ్యానికి మించి మురుగు ప్రవహిస్తుండడంతో డ్రైనేజీ లీకై రోడ్లమీద పారుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మురుగునీటి సామర్థ్య పైప్ లైన్‌లను నిర్మించడంలో ప్రభు త్వం ఘోరంగా విఫలమైందన్నారు. హైదరాబాద్ ప్రజలతో పాటు కుత్బుల్లాపూర్ ప్రజల నీటి కష్టాన్ని తీర్చకపోతే జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించడం ఖాయమని తెలిపారు.






