9 April, 2026 | 5:16 AM

బడంగ్‌పేట్ ‘బడా’ స్కామ్

09-04-2026 01:24 AM
  1. తెరవెనుక నేతలు.. బలైంది అధికారులు
  2. అందరూ శాఖాహారులే.. మరి రొయ్యల ముళ్ళెక్కడ?
  3. అవినీతి అక్రమాలపై క్రెడిట్ కోసం పాకులాడుతున్న పార్టీలు 

రంగారెడ్డి, ఏప్రిల్ 8(విజయక్రాంతి): ‘అందరూ శాఖాహారులే.. మరి రొయ్యల ముళ్లెలా వచ్చాయి?‘ అన్న సామెత ఇప్పుడు బడంగ్పేట్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి దర్యాప్తుకు అద్దం పడుతోంది. పైకి నీతులు చెబుతూ, లోపల ప్రజాధనాన్ని జల్లెడ పట్టిన ’అదృశ్య శక్తుల’ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేతలు డైరెక్షన్ ఇవ్వడం.. అధికారులు యాక్షన్ చేయడం.. చివరకు పాపం పండి అధికారులు బలికావడం.. ఇదీ ఇప్పుడు బడంగ్పేట్లో హాట్ టాపిక్ గా మారింది.

రూ. 150 కోట్ల దోపిడీ.. వ్యవస్థలనే మింగేశారు..

బడంగ్పేట్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీలో విలీనమైన తరుణంలో వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ విలువ అక్షరాలా రూ.150 కోట్ల రూపాయలకు పైమాటే అని తెలుస్తోంది. విజిలెన్స్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.టెండర్లు లేవు.. నిబంధనలు లేవు... ఇక్కడ. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. లక్ష దాటితే టెండర్ పిలవాలన్న నిబంధనను తుంగలో తొక్కారు.

తమ అనుయాయులకు ఇష్టానుసారంగా పనులు కట్టబెట్టారు. జరగని పనులకు నకిలీ బిల్లుల మాయాజాలం చేశారు.అసలు పనే జరగకుండానే, సర్కారు కార్యక్రమాల పేరిట బోగస్ బిల్లులు సృష్టించి కోట్లు స్వాహా చేశారు.అక్రమ లేఅవుట్లు,అనుమతులు లేని ప్లాట్లకు పర్మిషన్లు ఇవ్వడం, పార్కు స్థలాల్లో అక్రమ కట్టడాలను ప్రోత్సహించడం వంటి దారుణాలకు ఒడిగట్టారు.

సస్పెన్షన్ వేటు.. ఏసీబీ గురి..

అవినీతికి సహకరించిన డిప్యూటీ కమిషనర్ సరస్వతితో పాటు మరో 9 మంది అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, అసలు కథ ఇక్కడే మొదలైంది. ఏసీబీ అధికారులు త్వరలోనే డీసీ సరస్వతిని విచారించనున్నారు. ఆమె నోరు విప్పితే, ఏ నేతల గుట్టు రట్టవుతుందోనని స్థానిక రాజకీయ వర్గాల్లో వణుకు మొదలైంది.

ఇంతకు సూత్రధారులు ఎవరు?..

అధికారులు కేవలం ’పాత్రధారులు’ మాత్రమేనని, వారి వెనుక ఉన్న ’సూత్రధారులు’ రాజకీయ నేతలేనని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్ లో ఏపని ఉన్న 

‘నలుగురు కాంట్రాక్టర్లకే 80% పనులు ఎలా దక్కాయి? ఆ కాంట్రాక్టర్లు ఏ నేతకు బినామీలు?‘ అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఒకవైపు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మేయర్, కాంగ్రెస్, బీజేపీ నేతల మౌనాన్ని ప్రశ్నిస్తుండగా.. మరోవైపు అధికారులు ఏ క్షణాన ఎవరిపై వేటు పడుతుందోనని భయం భయంగా గడుపుతున్నారు. ప్రజాధనాన్ని దిగమింగిన తిమింగలాల మెడకు ఏసీబీ ఉచ్చు బిగుస్తుందా? దోచుకున్న ప్రతి పైసాను రికవరీ చేస్తారా? అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

అధికారం అండతో అక్రమాలకు తెరలేపిన నేతలు, వారికి వంత పాడిన అధికారులు ఇప్పుడు ఏసీబీ విచారణతో అడ్డంగా బుక్కయ్యారు. ఇక అసలు దోషులు ఎవరో తేలాల్సి ఉంది. మరోపక్క బడంగ్పేట్ కార్పొరేషన్ లో అవినీతిపై  ప్రజల మద్దతు పొందేందుకు  ఆయా పార్టీలు పడరాన్ని పాట్లు పడుతున్నాయి. వరుసగా అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బిజెపి పార్టీలో ప్రెస్ మీట్ లు పెట్టి  అవినీతిపై ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారు.

బిజెపి పార్టీ ఒక అడుగు ముందుకేసి  బడంగ్పేట్ కార్పొరేషన్ ఆవరణలో ధర్నాలు నిరసన పేరిటా కార్యక్రమాలు కొనసాగించడం కోసం మెరుపు. చూడాలి మరి  ఆయా పార్టీలు  పరస్పర ఆరోపణలకే పరిమితం అవుతాయా?... అవినీతిలో భాగస్వామ్యం పార్టీ నేతలకు వంత పాడుతాయా అనేది త్వరలోనే తేలనుంది.