అమ్మవార్ల ఆగమనం..పులకించిన భక్త జనం
- గండోర్రె గుట్ట నుండి నాగులమ్మ
ఎర్రెట్టల గుట్ట నుండి సడాలమ్మ
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
మంగపేట, మార్చి 4 ( విజయక్రాంతి ) : ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో జరుగుతున్న మహా జాతరలో భాగంగా బుధవారం నాగులమ్మ, సడాలమ్మ అమ్మవార్లు గద్దెల పైకి చేరడంతో జాతరలోని ముఖ్య ఘట్టం ప్రారంభమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు నాగులమ్మ ప్రధాన పూజారి బాడిశ నాగరమేష్ ఆధ్వర్యంలో ఆదివాసీ పూజారులు,
వడ్డెలు నాగులమ్మ ఆలయ సమీపంలోని గండోర్రె గుట్ట వద్ద నాగులమ్మ తల్లికి, అదే సమయంలో ఎర్రెట్టల గుట్ట వద్ద సడాలమ్మకు రెండు గంటలకు పైగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గండోర్రె గుట్ట నుండి నాగులమ్మను, ఎర్రెట్టల గుట్ట నుండి సడాలమ్మను అర్థి బిడ్డల డోలు వాయిద్యాల నడుమ తీసుకువచ్చి లక్ష్మి నర్సాపూర్ గ్రామంలో నాగులమ్మకు చెందిన డాలు జెండాలతో ఎదుర్కోలు నిర్వ హించారు.
అనంతరం రమణక్కపేట సమీపంలో పవిత్ర గోదావరి నది వద్ద పూజారులు ఏడు చెలిమలు తీసి పలు రకాల దళాల ( ఆకులతో )తో అభిషేకాలు, పుణ్యస్నానాల కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాగులమ్మ ఆలయానికి తీసుకు వచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. చుంచుపల్లి గ్రామం నుండి అమ్మవారికి చెందిన అవిరేణి కుండలను ఆదివాసీ మహిళలు ఆలయానికి సమర్పించారు.
ఆలయ ధర్మకర్త, మేనేజింగ్ ట్రస్టీ, ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామి ( దేవర బాల ) పూజ కార్యక్రమాలను పర్యవేక్షించగా పూజారులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారులు, వడ్డెలు, ఆదివాసి కుల పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




