ఈవీ బస్సుల హవా
స్థలం ఆర్టీసీది.. బస్సులు ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలవి
ప్రైవేటు బస్సులకు అధికారిక హోదా!
అద్దె బస్సులతో ఆర్టీసీని బలోపేతం చేసే కార్యక్రమంగా చిత్రీకరణ.. ఆర్టీసీ కార్మికుల్లో అసంతృప్తి
* ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జంటనగరాల్లో 35 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీని వినియోగిస్తున్నారు. కొత్త నియామకాలు, కొత్త బస్సులతో ఆర్టీసీ దేశంలోనే ఉత్తమంగా నిలుస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 545 ఈవీ బస్సులను నడుపుతున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా 2,200 బస్సులను రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నాం.
పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజా రవాణాపై ఎంత ప్రభావం చూపుతా యో అందరికీ తెలుసు. త్వరలో మరో 2,200 ఈవీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈవీ బస్సుల వల్ల ట్రాఫిక్ తగ్గడంతోపాటు కాలు ష్యం కూడా తగ్గుతుంది. హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. కూకట్‌పల్లి డిపోకు 60 ఈవీ బస్సులను కేటాయించాం..
- మే 27న కూకట్‌పల్లి డిపోలో ఈవీ బస్సుల ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి) : దేశంలోనే ఒకప్పుడు అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరుపడ్డ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేలా ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే.. ప్రజలకు మాత్రం తాము ఆర్టీసీని కాపాడుతున్నామనేలా భ్రమలు కల్పిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీలోకి ప్రవేశపెడుతున్న ఎల క్ట్రికల్ బస్సులను, ఆర్టీసీ బస్సులుగా ప్రజల్లో ప్రచారం కల్పించడంపై ఆర్టీసీ కార్మికులు, సామాజికవేత్తలు మండిపడుతున్నారు.
అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి.. ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ.. ఆర్టీసీలోకి ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నాయని, అయితే ప్రజలకు మాత్రం అసలు విషయాల ను తెలియనీయకుండా ప్రైవేటు బస్సులకు.. ఆర్టీసీ ‘అధికార’ హోదాను ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోలో సుమారు 60 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టామంటూ.. అధికారిక హడావుడి కార్యక్రమాన్ని నిర్వహించారు.
వాస్తవానికి ఇవన్నీ ప్రైవేటు బస్సులు. ఎలెక్ట్రా అనే ప్రైవేటు కార్పొరేట్ కంపెనీ తయారుచేసి.. అం దించిన అద్దె బస్సులు. అంటే, అవన్నీ ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులన్నమాట. కిలోమీటరుకు ఇంత చొప్పున అంటూ.. అద్దెకు తీసుకున్న బస్సులు. ఈ బస్సులను నడిపేది సదరు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలే. పైగా బస్సుల నిర్వహణకు కావాల్సిన ఉద్యోగులు, సిబ్బందిని కూడా సదరు ప్రైవేటు కంపెనీయే నియమించుకుని, జీతభత్యాలు ఇస్తుంది.
అయితే ప్రైవేటు కంపెనీ అద్దెకు ఇచ్చిన బస్సులకు ప్రారంభోత్సవం పేరుతో.. అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకంగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై.. ఆర్టీసీలోకి ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నాం.. కూకట్‌పల్లి డిపోకు 60 బస్సులను కేటాయించామన్నట్టుగా మాట్లాడటంపై ఆర్టీసీ కార్మికుల్లో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు కార్పొరేట్ కంపెనీ అద్దెకు ఇచ్చిన బస్సులను.. ఆర్టీసీ బస్సులుగా, ఆర్టీసీ కొనుగోలుచేసి నడిపిస్తోందనే విధంగా ప్రచారం చేసుకోవడంపై అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.
నిజానికి ఆర్టీసీ భవిష్యత్తును నిర్ణయించేవి ఈవీ బస్సులే అనేది నిర్వివాదాంశం. అయితే ఈవీ బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేస్తుందా.. లేక ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు అద్దె బస్సుల రూపంలో ప్రవేశపెడతాయా అనేది ఇక్కడ కీలకాంశం. ఈ నేపథ్యంలోనే తాజాగా కూకట్‌పల్లి డిపోలో ఆర్టీసీ అధికారికంగా జరిగిన ఈవీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం వాస్తవానికి ప్రైవేటు అద్దెకు ఇచ్చిన ఇవీ బస్సులవి కావడం గమనార్హం. అంటే అద్దె బస్సులను ఆర్టీసీ బస్సులుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా.. అధికారికంగా ఈవీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అద్దె బస్సులకు.. ఆర్టీసీ స్థలాలు ఎందుకు..?
నిజానికి కూకట్‌పల్లిలో జరిగింది ఇప్పుడే మొదటిది కాదు.. ఇప్పటివరకు సుమారు 600 వరకు ఈవీ బస్సులను వివిధ డిపోల్లో ప్రవేశపెట్టారు. ఇవన్నీ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలవే. ఇందులో ఒక్కటంటే ఒక్కటికూడా ఆర్టీసీ సొంత బస్సు లేకపోవడం గమనార్హం. ఈ బస్సులను నిర్వహణలో పనిచేసేవారందరూ సదరు ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులే. సదరు కంపెనీయే వారికి జీతభత్యాలు ఇస్తుంది. అలాంటప్పుడు.. ఈవీ బస్సులకు.. ఆర్టీసీ డిపోల్లో స్థలం ఎందుకు కేటాయించాలనే ప్రశ్న ఉదయిస్తోంది.
దీనిపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఎవరూ పెదవి విప్పడం లేదు. కేవలం ఆర్టీసీని ప్రైవేటీకరించడంలో భాగంగానే.. ప్రైవేట ఈవీ బస్సులకు ఛార్జింగ్ చేసుకు నేందుకు ఆర్టీసీ డిపోల స్థలాన్ని కేటాయించడంపై కార్మికుల్లో ఆగ్రహం కనపడు తోంది. ఈవీ బస్సుల పేరుతో.. మెల్లమెల్లగా ఆర్టీసీ డిపోలను ఆక్రమించి.. తరువాత ఆర్టీసీకి ఉన్న సొంత బస్సులను బయటికి పంపిస్తారని.. దీనితో డిపోలు ప్రైవేటు కంపెనీల పరమవుతాయని కార్మికులు అంటున్నారు.
ఏదేమైనా.. ప్రైవేటు కంపెనీలు అద్దె ప్రాతిపదికన ఇచ్చిన ఈవీ బస్సులను.. ఆర్టీసీకి చెందిన బస్సులుగా ప్రచారం చేసుకోవడంతోపాటు.. ఆర్టీసీ డిపో ల్లో స్థలాలను, వాటికి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రైవేటు అద్దె బస్సులకు ‘అధికారిక’ హోదా ప్రకటించడమేనంటూ వారు అభిప్రా యం వ్యక్త చేస్తున్నారు.
కొసమెరుపు..
తాజాగా జగిత్యాల జిల్లాలో.. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ధర్నా చేస్తుంటే.. ఒక ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ ‘..ముందుగా వరి ధాన్యం కొనుగోలు చేయండి... పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై తరువాత ధర్నా చేయొచ్చు..’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనితో ప్రభుత్వం (ఆర్టీసీ) ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ.. ఆదేశాలు జారీచేసింది.
ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఉద్యోగం నుంచి తొలగించే ఆదేశాలను వెనక్కితీసుకున్నామని, సదరు డ్రైవర్ హైర్ బస్సు (అద్దె బస్సు) డ్రైవర్ అని, ఆర్టీసీ ఉద్యోగి కాదని పేర్కొంటూ.. ఈ విషయంలో డిపో మేనేజర్‌ను బదిలీ చేసినట్టు సాక్షాత్తు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరి అదే అద్దెకు ఇచ్చిన ఈవీ బస్సులను ఆర్టీసీ బస్సులుగా పేర్కొంటూ.. అధికారికంగా ప్రారంభోత్సవం చేసినందుకు ఎవరు బాధ్యులు.. ఆ బాధ్యులను ఏం చేయాలని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తుండటం దీనికి కొసమెరుపు.






