పోలీస్ పోస్టులకు వయోపరిమితి పెంచాలి
- ఎస్‌ఐకి 38, కానిస్టేబుల్‌కు 36 ఏళ్లు చేయాలి
- ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో వయోపరిమితిని పెంచాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం విద్యానగర్ బీసీ భవన్‌లో నిరుద్యోగ జేఏసీ నేత శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. ఎస్‌ఐ పోస్టులకు 38 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 36 ఏళ్ల వయోపరిమితి కల్పించాలని కోరారు.
అలాగే అ ప్లికేషన్ ఫీజును తగ్గించడంతో పాటు, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని, లాంగ్ జంప్ నిబంధన సడలించాలని, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మెగా డీఎస్సీ, గ్రూప్--1, గ్రూప్--2, గ్రూప్--3, గ్రూప్--4 పోస్టులకు భారీ స్థాయిలో నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. నిరుద్యోగ జేఏసీ నేత శంకర్ నాయక్, నిరుద్యోగులు నరేశ్, రాజు, బాలు, శ్రీకాంత్, గీత, రంజీత్, బీసీ నాయకులు నీలం వెంకటేష్, అనంతయ్య, విష్ణు తదితరులున్నారు.






