calender_icon.png 24 February, 2026 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితులను అరెస్ట్ చేయాలి

24-02-2026 12:41:39 AM

  1. బాధితులకు 10 లక్షల పరిహారం ఇవ్వాలి
  2. డీజీపీ శివధర్‌రెడ్డికి బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): పసికందు మృతికి కారణమైన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం బీసీ జేఏసీ బృందం డీజీపీ శివధర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసింది.

అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అగ్రకుల అహంకారంతో బీసీ, దళిత కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి, రెండు నెలల పసికందు ప్రాణాలు గాల్లో కలవడానికి కారణమైన వారిపై తక్షణమే హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖను డిమాండ్ చేశారు.

గణేష్, చంద్రకళలకు ప్రభుత్వం  స్పందించి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కుమ్మెర ఘటనలో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని, బీసీ రజక కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.