calender_icon.png 24 February, 2026 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాల మైదానంలో ప్రైవేటు దందా

24-02-2026 12:39:55 AM

జాతర సందర్భంగా జాయింట్ వీల్ ఏర్పాటుకు అనుమతి 

రూ. రెండు లక్షలకు ఒప్పందం 

పాఠశాలకు రూ. లక్ష ఇరవై వేలు 

మిగతా రూ. 80 వేలల్లో వాటాలు 

విద్యాశాఖ అధికారుల నిర్వాకం 

మేడ్చల్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని ప్రధానోపాధ్యాయుడు వారం రోజులు ప్రైవేట్ వ్యాపారానికి అద్దెకు ఇచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక పెద్ద అవినీతి జరిగిందని, విద్యా శాఖకు సంబంధించి పలువురు అధికారులకు వాటాలు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్లో ప్రతి ఏడూ రామలింగేశ్వర స్వామి జాతర ఘనంగా జరుగుతుంది. దీనికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.

ఆలయం వద్ద స్థలం లేనందున రోడ్డుపై దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో జాతర జరుగుతున్నందున పాఠశాల మైదానంలో జాయింట్ వీల్ ఇతర చిన్నపిల్లల ఆటలకు సంబంధించి ఈవెంట్స్ ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించారు. మైదానంలో జాయింట్ వీల్, ఇతర ఈవెంట్స్ ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. మైదానం అద్దెకు ఇవ్వాలంటే జిల్లా విద్యాధికారి అనుమతి తప్పనిసరి. జాయింట్ వీల్, ఇతర ఈవెంట్స్ ఏర్పాటుకు వీలుగా మైదానంలో ఇష్టానుసారంగా తవ్వుతున్నారు. మైదానం స్వరూపం మారిపోతుంది. తర్వాత విద్యార్థులు ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. 

కింది నుంచి పైదాకా వాటాలు 

అద్దెకు ఇవ్వడం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు తెలుస్తోంది. జాతర ముగిసే వరకు సుమారు వారం రోజులకు వ్యాపారితో ప్రధానోపాధ్యాయుడు రూ. రెండు లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. లక్ష ఇరవై వేలు పాఠశాల అకౌంట్లో జమ చేసి మిగతావి వాటాలుగా పంచుకున్నట్లు తెలిసింది. 

వారం రోజులు విద్యార్థులకు ఇబ్బంది 

పాఠశాల మైదానంలో జెయింట్ వీల్, ఇతర ఈవెంట్స్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కానుంది. పాఠశాలలో క్రీడా పరికరాల వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయని, ఈ సమయంలో పాఠశాలలో ఇలాంటివి నిర్వహించడం సరికాదని అంటున్నారు.

వెంటనే వాటిని తొలగించాలని కోరుతున్నారు. మైదానం అద్దెక్కించిన విషయమై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి వివరణ తీసుకోవడానికి ఫోన్లో ప్రయత్నించగా స్పందించలేదు. మండల విద్యాధికారి శంకర్ ను వివరణ కోరగా తనకు పూర్తి వివరాలు తెలియవని, తెలుసుకుంటానని చెప్పారు.